వైఎస్ పాదయాత్ర సాక్షిగా అన్నాచెల్లెళ్ల ‘పోరు’!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసి, సంక్షేమ రాజ్యానికి బాటలు వేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన చారిత్రాత్మక ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన వారసులు, అన్నాచెల్లెళ్లు అయిన వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి ఆశయాల వారసులం మేమంటే మేమని ఇద్దరూ క్లెయిమ్ చేసుకుంటున్నప్పటికీ, ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు శృతిమించాయి.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తండ్రి పాదయాత్రను గుర్తు చేసుకుంటూ భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. ఏప్రిల్ 9, 2003న ఎర్రటి ఎండలో ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వైఎస్సార్ వేసిన అడుగులు, రాష్ట్ర చరిత్రను తిరగరాశాయని ఆయన కొనియాడారు. “నేనున్నాను” అనే భరోసాతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ నిలిచిపోయారని, ఆ పాదయాత్రే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ముఖ్యంగా వైఎస్సార్ హయాంలో జరిగిన ఉచిత విద్యుత్ సంతకం, జలయజ్ఞం, పోలవరం ప్రాజెక్టు వేగం, విద్య, వైద్య రంగాల్లో వచ్చిన విప్లవాత్మక మార్పులను జగన్ గుర్తు చేశారు. తన తండ్రి వేసిన ఆ ముద్రను ఎవరూ చెరిపేయలేరని, అదే స్ఫూర్తితో తన ప్రయాణం కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు. తండ్రి వారసత్వాన్ని తన సంక్షేమ పాలనతో ముందుకు తీసుకెళ్తున్నానని ఆయన పరోక్షంగా ఈ ట్వీట్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు.
జగన్ ట్వీట్‌కు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అత్యంత ఘాటుగా స్పందించారు. వైఎస్సార్ పాదయాత్రను ఒక కాంగ్రెస్ సైనికుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రారంభించారన్న విషయాన్ని ఆమె ప్రధానంగా గుర్తు చేశారు. వైఎస్సార్ పేరును పార్టీలో పెట్టుకుని, ఆయన ఆశయాలకు విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారని నేరుగా విమర్శించారు.
లౌకికవాదానికి నిలువుటద్దంలా నిలిచిన వైఎస్సార్ ఎక్కడ? మతోన్మాద బీజేపీకి ఢిల్లీలో తలవంచి, రాష్ట్రంలో మౌనం వహిస్తున్న జగన్ ఎక్కడ? అని ఆమె ప్రశ్నించారు. వక్ఫ్ చట్టం, దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు వంటి అంశాల్లో జగన్ వైఖరిని ఆమె తప్పుబట్టారు. జగన్ ఐదేళ్ల పాలనలో దళితులు, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని, ఇది వైఎస్సార్ ఆత్మ క్షోభించేలా ఉందని ఆరోపించారు. ఫాసిస్టు శక్తులకు, క్యాపిటలిస్టులకు జగన్ దాసోహమయ్యారని షర్మిల విమర్శించారు. వైఎస్సార్ ఆశయాలకు పూర్తి భిన్నంగా ఉంటూ ఆయనకు నివాళులు అర్పించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. జగన్ ఇప్పుడు చేయాల్సింది పాదయాత్ర కాదని, ఆత్మవిమర్శన యాత్ర అని చురకలు అంటించారు.
ఒకప్పుడు అన్న కోసం ఉప ఎన్నికల్లో, పాదయాత్రలో అలుపెరగకుండా శ్రమించిన షర్మిల, నేడు అదే అన్నపై రాజకీయంగా యుద్ధం ప్రకటించడం వైఎస్సార్ అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది. వైఎస్సార్ పాదయాత్ర వార్షికోత్సవం సాక్షిగా బయటపడ్డ ఈ విభేదాలు, కేవలం కుటుంబ కలహాలే కాక, సిద్ధాంతపరమైన పోరాటంగా కూడా మారుతున్నాయి. తండ్రి పేరును, పాదయాత్ర సెంటిమెంట్‌ను ఇద్దరూ వాడుకుంటున్నప్పటికీ, ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు జగన్ తన తండ్రి సంక్షేమ పథకాలే తన ఆయుధాలని అంటుంటే, మరోవైపు వైఎస్సార్ అసలైన రాజకీయ వారసత్వం తనదేనని షర్మిల వాదిస్తున్నారు. మొత్తానికి వైఎస్సార్ పాదయాత్ర జ్ఞాపకం.. అన్నాచెల్లెళ్ల మధ్య ట్వీట్ల యుద్ధానికి వేదికైంది.
ఇవి కూడా చదవండి







