ఏపీ విభజనపై బిజెపి ఎంపీ సంచలన కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ(Telangana) రాష్ట్రాల విభజన అంశం మరోసారి పార్లమెంట్ వేదికగా చర్చకు వచ్చింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా, బీజేపీ యువ ఎంపీ తేజస్వీ సూర్య(Tejasi Surya).. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనను అత్యంత అశాస్త్రీయంగా, బాధ్యతారాహిత్యంగా చేపట్టిందని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. “ప్రపంచ చరిత్రలోనే ఇంతకంటే చెత్తగా రాష్ట్రాన్ని ఎవ్వరూ విడగొట్టలేరు. కనీసం ఒక పద్ధతి లేకుండా, సరైన ప్రణాళిక లేకుండా కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియను నిర్వహించింది” అని విమర్శించారు.
విభజన సమయంలో అనుసరించిన విధానాల వల్లే నేటికీ రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు మరియు నీటి వాటాల విషయంలో వివాదాలు కొనసాగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. బ్రిటిష్ వారు దేశాన్ని విభజించిన తీరు కంటే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిన తీరు దారుణంగా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్ర ప్రజల భవిష్యత్తును కాంగ్రెస్ ఫణంగా పెట్టిందని, ఆనాటి తప్పుడు నిర్ణయాల వల్ల రెండు రాష్ట్రాల ప్రజలు దశాబ్ద కాలంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తేజస్వీ సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఒకవైపు ఏపీకి రావాల్సిన విభజన హామీల గురించి చర్చ జరుగుతున్న తరుణంలో, బీజేపీ ఎంపీ కాంగ్రెస్ వైఫల్యాన్నే టార్గెట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ నేతృత్వంలోని.. ప్రతిపక్షాలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం సభలో జరగబోయే ఓటింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి








