ఏపీ-తెలంగాణ కలవాలన్నదే వైసీపీ విధానం.! సజ్జల కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. విభజన ముగిసిన అధ్యాయమని.. ఆ కేసును క్లోజ్ చేయాలనేలా రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. అదే జరిగితే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినవారవుతారని.. దీనిపై సీఎం జగన్ పునరాలోచించాలని ఉండవల్లి సూచించారు. దీనిపై సమర్థవంతంగా వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ పై సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అసంబద్ధం అనే కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉందన్న సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఇప్పటికీ తాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కే కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలినుంచీ పోరాడింది వైసీపీనన్న సజ్జల ఇప్పటికీ అదే విధానానికి కట్టుబడి ఉన్నామన్నారు. కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఉండవల్లి పనిగట్టుకుని జగన్ వైపు విమర్శలు చేసినట్లు కనిపిస్తోందని సజ్జల అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ కలిసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అంతకుమించి కావాల్సిందేముందని సజ్జల అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాలని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. విభజనకు వ్యతిరేకంగా తొలినుంచి పోరాటం చేస్తున్నది వైసీపీనే అన్నారు. మళ్లీ తెలంగాణ, ఏపీ కలసిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే ఫస్ట్ స్వాగతించేది వైసీపీనేనన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ తరపున బలమైన వాదనలు వినిపిస్తామని స్పష్టం చేశారు. విభజనను వెనక్కు తిప్పాలని.. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని తేల్చి చెప్పారు. విభజన జరిగిన తీరుపైనే సుప్రీంకోర్టులో కేసు వేశారని.. విభజన చట్టంలో హామీల అమలుకోసం కాదని సజ్జల క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో విభజన చట్టంలో హామీల అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తోందన్నారు.













