షమీకి టీమిండియాలో మరో అవకాశం ఇవ్వాల్సిందే..!
టీమిండియా వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ(Mohmmad Shami) జాతీయ జట్టులోకి తిరిగి రావడంపై ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 36 ఏళ్ల సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్(Bhuvaneswar Kumar) న్యూజిలాండ్తో జరగబోయే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు అనూహ్యంగా భారత జట్టులోకి ఎంపికవ్వడంతో.. అదే తరహాలో మహ్మద్ షమీకి కూడా జట్టులో మరో అవకాశం ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా టీమిండియా పేసర్ నవదీప్ సైనీ ఈ అంశంపై స్పందిస్తూ షమీ పునరాగమనానికి పూర్తి మద్దతు ప్రకటించాడు.
2022 టీ20 ప్రపంచకప్ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన భువనేశ్వర్ కుమార్.. దేశీవాళీ క్రికెట్ మరియు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఈ సుదీర్ఘ నిరీక్షణ ముగియడంపై నవదీప్ సైనీ స్పందిస్తూ.. భువీ తిరిగొచ్చిన విధానం అందరికీ ఒక పెద్ద స్ఫూర్తి అని కొనియాడాడు. ఇదే సూత్రాన్ని మహ్మద్ షమీకి కూడా వర్తింపజేయాలని అభిప్రాయపడ్డాడు. “షమీ భాయ్ దేశీవాళీ క్రికెట్లో చాలా కష్టపడుతున్నాడు. ఆయనకు కూడా జట్టులో మరో అవకాశం దక్కాలి” అని సైనీ సెలెక్టర్లను ఉద్దేశించి పేర్కొన్నాడు.
గత కొన్నేళ్లుగా మహ్మద్ షమీ దేశీవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ, తన ఫిట్నెస్ను నిరూపించుకుంటున్నప్పటికీ జాతీయ జట్టు ఎంపికలో అతన్ని పక్కనబెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. భువీ ఎంపికతో 30 ఏళ్లు దాటిన అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు మళ్లీ తలుపులు తెరుచుకున్నట్లయిందని, కాబట్టి షమీని కూడా వన్డే లేదా టెస్టు ఫార్మాట్లలోకి పరిగణనలోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు మరియు కోచ్లు సైతం అభిప్రాయపడుతున్నారు. కాగా న్యూజిలాండ్ తో సీరీస్ కు షమీని ఎంపిక చేసే అవకాశం కనపడుతోంది.








