బీజేపీతో పొత్తు ఉంటే బాబు పరిస్థితి అంతే.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. తాజాగా జరిగిన ఓ చిట్‌చాట్‌లో ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ఏపీ సీఎం చంద్రబాబుపై(Chandrababu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీకైనా భవిష్యత్తులో మనుగడ ఉండదని ఆయన హెచ్చరించారు. కేంద్రంలో ప్రస్తుతం బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోవడం వల్లే టీడీపీకి(TDP) ప్రాధాన్యత ఇస్తున్నారని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. రేపు భవిష్యత్తులో బీజేపీకి సొంతంగా బలం పెరిగితే, చంద్రబాబును కూడా పక్కనపెట్టడం ఖాయమన్నారు.
ఇప్పటికే నితీష్ కుమార్, ఏక్ నాథ్ షిండేల పరిస్థితి ఏమైందో మనం చూస్తున్నాం.. చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే అవుతుందన్నారు. ప్రభుత్వాల పనితీరుపై స్పందిస్తూ.. “లోక్‌సభ, రాజ్యసభలు చట్టాలు చేయడానికే ఉన్నాయి, కానీ వాటిని అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలే. 2/3 మెజారిటీ ఉందని ప్రధాని తనని తాను రాజుగా భావించి ఇష్టానుసారం చట్టాలు చేస్తానంటే కుదరదు. డిక్టేటర్ షిప్‌ని ఈ దేశం అంగీకరించదు” అని రేవంత్ స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేవలం 11 సీట్లే ఉన్నాయని గుర్తు చేసారు.
“సీట్లు తక్కువగా ఉన్నాయని చంద్రబాబు తానే రాజునని చట్టాలు తెస్తే ఎవరైనా ఒప్పుకుంటారా?” అని ప్రశ్నించారు. చట్టసభల్లో మెజారిటీ ఉన్నంత మాత్రాన ప్రజాస్వామ్య విలువలని విస్మరించకూడదని హితవు పలికారు. మహిళా రిజర్వేషన్ల అంశంపై స్పందిస్తూ.. 2011 జనాభా లెక్కల ప్రకారమే మహిళలకు తక్షణమే రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సాధారణంగా చంద్రబాబు విషయంలో కాస్త సానుకూలంగా ఉండే రేవంత్.. ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.








