YCP: వైసీపీని వెంటాడుతున్న 11.. పార్లమెంటులో జస్ట్ మిస్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 11 నెంబర్ వెంటాడుతూనే ఉంది. గత ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు దక్కడంతో అప్పటి నుంచి ఆ పార్టీని ఎలెవెన్ పార్టీ అంటూ ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. దీంతో.. అప్పటి నుంచి నెంబర్ అంటేనే వైసీపీ నేతలు వణికిపోతున్నారు. ఇవాళ ఢిల్లీలో అలాంటి పరిస్థితే ఎదురైంది. పార్లమెంటులో తమ పార్టీకి కేటాయించిన గది నంబర్‌ను మార్చుకోవాల్సి వచ్చింది.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గతంలో 11వ నంబర్ గదిని కేటాయించారు. గత ఎన్నికల్లో 154 స్థానాల నుంచి 11కు పడిపోవడం, కేవలం 11 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకోవాల్సి రావడంతో ఆ నంబర్ పట్ల నాయకుల్లో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే, తమకు కేటాయించిన 11వ నంబర్ గదిని మార్చాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. దీనికి అధికారులు సానుకూలంగా స్పందించి 12వ నంబర్ గదిని కేటాయించారు. దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి
వైసీపీకి, 11వ నంబర్‌కు మధ్య ఉన్న సంబంధం కేవలం గది నంబర్‌కే పరిమితం కాలేదు. గత కొంతకాలంగా ఆ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులన్నీ ఈ అంకె చుట్టూనే తిరుగుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకోవడానికి కావాల్సిన సంఖ్య కూడా రాకపోవడం పార్టీకి పెద్ద దెబ్బ. గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లినప్పుడు ఆ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడేవాళ్లు. ఆ తర్వాత టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడంతో వైసీపీ ఆ నెంబర్ ను పదేపదే ఎత్తిచూపేది. ఇప్పుడు టీడీపీ, వైసీపీని అదే స్థాయిలో 11 నెంబర్ ను ఎత్తి చూపుతోంది.
దీంతో 11 నెంబర్ అంటేనే వైసీపీ నేతలు అశుభంగా భావిస్తున్నారు. వీలైనంత వరకూ ఆ నెంబర్ ను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంటులో 11 నెంబర్ గదిని తీసుకుంటే, మరోసారి ఆ ట్రోలింగ్ తప్పదని వైసీపీ నేతలు భావించారు. అందుకే ఆ నెంబర్ గది వద్దని, వేరొక గది కేటాయించాలని కోరారు. చివరకు వాళ్ల ప్రయత్నం ఫలించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి








