YSRCP: వైసీపీకి త్వరలో మరో ఇద్దరు గుడ్ బై..!?
రాజకీయ పార్టీలకు అధికారంలో ఉంటేనే ఆదరణ లభిస్తుంది. ఇందుకు అతిపెద్ద ఉదాహరణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP). గత ఐదేళ్లూ ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ (AP) లో పవర్ లో ఉండేది. అప్పుడు ఆ పార్టీ చెప్పిందే వేదం.. ఆ పార్టీ నేతలు కూడా తమకు తిరుగులేదనే ఫీలింగులో ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది. దీంతో నేతలంతా పక్కచూపులు చూడడంలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీని వీడిపోయారు. మరికొందరు రేపోమాపో అన్నట్టున్నారు. వారం, పది రోజుల్లో ఇద్దరు కీలక నేతలు వైసీపీని వీడుతారనే ప్రచారం ఇప్పుడు రాష్ట్రంలో జోరుగా వినిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. దీంతో గత ఐదేళ్లలో తాము చేసిన కక్షసాధింపులను ప్రస్తుత ప్రభుత్వం గుర్తు పెట్టుకుని వేధిస్తుందేమోనని కొంతమంది నేతలు వణికిపోతున్నారు. అలాంటివాళ్లు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. కొందరు అవకాశం ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. మరికొందరు వైసీపీ పనైపోయిందని.. ఇక ఆ పార్టీలో ఉంటే రాజకీయ మనుగడ సాగించడం కష్టమనే ఫీలింగుకు వచ్చేశారు. అందుకే ఏదైనా మంచి పార్టీలో చేరి కొత్త రాజకీయం మొదలు పెట్టాలనుకుంటున్నారు. అలాంటి వాళ్లలో మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత (Mekathoti Sucharitha) ఒకరు.
మేకతోటి సుచరిత వైఎస్ ఫ్యామిలీకి (YS Family) అత్యంత సన్నిహితురాలు. వైఎస్ బతికున్నప్పటి నుంచి ఆ కుటంబంతో సుచరిత కుటుంబానికి సన్నిహత సంబంధాలున్నాయి. జగన్ (YS Jagan) 2019లో అధికారంలోకి వచ్చాక సుచరితకు హోంమంత్రి (Home Minister) పదవి ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత తీసేశారు. అదే సమయంలో విడదల రజనికి మంత్రిపదవి ఇవ్వడం సుచరితకు నచ్చలేదు. అయితే సుచరిత భర్తకు మచిలీపట్నం పోర్టులో (Machilipatnam Port) కీలక బాధ్యతలు ఇచ్చి శాంతింపజేశారు జగన్. ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో సుచరిత దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్ 2 సార్లు గుంటూరు (Guntur) జిల్లాలో పర్యటించినా ఆమె హాజరు కాలేదు. సుచరిత జనసేనలో (Janasena) చేరేందుకు మార్గం సుగమమైందని సమాచారం. నాగబాబు (Nagababu) విదేశాల నుంచి రాగానే అధికారికంగా పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక భీమవరం (Bhimavaram) మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ (Grandhi Srinivas) కూడా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2019లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను ఓడించారు గ్రంథి శ్రీనివాస్. అందుకు ప్రతిపలంగా ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఆశించారు. అయితే జగన్ పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసినందుకు గ్రంథి శ్రీనివాస్ పై కాపు నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో గ్రంథి శ్రీనివాస్ దారుణంగా ఓడిపోయారు. టీడీపీ, జనసేన కలిసి ఉన్నంత వరకూ తనకు రాజకీయ మనుగడ లేదని భావిస్తున్నారు గ్రంథి శ్రీనివాస్. అందుకే వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. గ్రంథి శ్రీనివాస్ ను బుజ్జగించేందుకు పేర్నినాని (Perni Nani), కారుమూరి నాగేశ్వర రావు (Karumuri Nageswara Rao) భీమవరం వెళ్లారు. అయితే గ్రంధి శ్రీనివాస్ మాత్రం తన నిర్ణయంలో మార్పు లేదని చెప్పినట్టు సమాచారం. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. సో… వారం, పది రోజుల్లోనే వైసీపీకి ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేయబోతున్నారు.













