ఒక్క వ్యక్తి చేసిన దానం.. నేడు వేల మందికి నీడనిచ్చే మహావృక్షం : మంత్రి లోకేష్
సివిల్ సొసైటీ, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు
విలువలు లేని వికసిత్ భారత్.. వికసిత్ భారత్ కాదు
విశాఖ అభివృద్ధి మన బాధ్యత.. ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేయబోం
హరే కృష్ణ గోకుల్ ట్రస్ట్, ప్రేమ ఉదయం, ఏజ్ కేర్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేష్
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మంత్రి లోకేష్
విశాఖపట్నం, ఆనందపురం: ప్రేమ ఉదయం & ఏజ్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం వద్ద నిర్వహించిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా హరే కృష్ణ మూవ్మెంట్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేష్‌కు నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కిచెన్‌ను పరిశీలించారు. హరే కృష్ణ వైకుంఠం కల్చరల్ కాంప్లెక్స్ నిర్మాణాని భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఆలయానికి సంబంధించిన ప్రత్యేక ఏవీనీ మంత్రి లోకేష్ తిలకించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి లోకేష్ ను నిర్వాహకులు సత్కరించారు.
అనంతరం ప్రేమ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ నూతన కాలేజీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, నూతన కాలేజీ భవనాలను పరిశీలించారు.
అనంతరం ఏజ్ కేర్ ఫౌండేషన్/స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ జెరియాట్రిక్ & పాలియేటివ్ కేర్ సెంటర్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. డోనర్ గ్యాలరీని సందర్శించారు. ఏజ్ కేర్ ఫౌండేషన్ భవనంలోని 4వ అంతస్తు, 5వ అంతస్తును మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. అనంతరం సంస్థకు సహకరిస్తున్న ముఖ్య దాతలతో బోర్డ్‌రూమ్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ… దివంగత పద్మశ్రీ డాక్టర్ ఎస్.వి. ఆదినారాయణరావు గారు సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఒక వ్యక్తి చేసిన దానం నేడు అనేక మందికి ఉపయోగపడే మహావృక్షంగా మారిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆదినారాయణరావు గారి కుటుంబం సమాజ సేవ కోసం ఆరు ఎకరాల భూమిని కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ భూమిలో కాలేజీ, హరేకృష్ణ మిషన్ ద్వారా మధ్యాహ్న భోజన కార్యక్రమం, వృద్ధుల సంరక్షణ కేంద్రం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విలువలతో కూడిన విద్యే నిజమైన అభివృద్ధి
“సమాజంలో తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యం చేసే పరిస్థితులు బాధాకరం. ఇటువంటి రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా వృద్ధులకు అత్యాధునిక కేర్ సెంటర్ నిర్మించడం అభినందనీయం. నేను మీకు చేయగలిగింది ఒకటే. పిల్లలకు అంగన్వాడీ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కేవలం విద్యను అందించడం కాకుండా విలువలు, నైతికతతో కూడిన విద్య అందించాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా నాపై ఉంది” అని అన్నారు.
విలువలు లేని వికసిత్ భారత్.. వికసిత్ భారత్ కాదు
“చాగంటి కోటేశ్వరరావు గారికి కేబినెట్ ర్యాంక్‌తో అడ్వైజర్ బాధ్యతలు అప్పగించినా, ఆయన ప్రభుత్వం నుంచి ఎలాంటి సదుపాయాలు తీసుకోలేదు. పిల్లలకు విలువలు నేర్పే పుస్తకాలను రూపొందించి వాటిని ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలని మాత్రమే ఆయన కోరారు. ‘అమ్మకి చెప్పలేని పని ఏదీ చేయొద్దు’ అనే చాగంటి కోటేశ్వరరావు గారి మాట ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా ఉండాలి” అని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.
వృద్ధులకు గౌరవంగా జీవించే అవకాశం కల్పించాలి
“వృద్ధులను గౌరవంగా చూసుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులకు రూ.4,000, వికలాంగులకు రూ.6,000 పెన్షన్ అందిస్తోంది. వృద్ధులు సమాజంలో గౌరవంగా జీవించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన” అని పేర్కొన్నారు.
దాతల సేవలకు అభినందనలు
“సేవా కార్యక్రమాలకు విరాళాలు అందించిన దాతలందరూ సమాజానికి మార్గదర్శకులు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయం. పాలియేటివ్ కేర్ సెంటర్ రాష్ట్రంలోనే ప్రత్యేకమైనదిగా నిలుస్తుంది. ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేలా అందరం కలిసి పనిచేయాలి. సివిల్ సొసైటీ, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఈ ప్రాంగణం ఒక చక్కటి ఉదాహరణ. యువత కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి” అని మంత్రి పిలుపునిచ్చారు.
విశాఖపట్నం అభివృద్ధి మన బాధ్యత
రాష్ట్ర విభజన తర్వాత విశాఖపట్నానికి ఎంతో చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ దేశంలోనే తొలి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకనామిక్ రీజియన్‌గా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలో విశాఖపట్నం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని అన్నారు.
డేటా సెంటర్ల విషయంలో అపోహలు వద్దు
“ప్రజల ప్రయోజనాలకు, ప్రకృతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమం చేపట్టదు. అభివృద్ధి వేగంగా జరుగుతున్నప్పుడు వచ్చే అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలను వివరించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. డేటా సెంటర్ల విషయంలో కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా ఇంటెల్ డేటా సెంటర్‌ను పరిశీలించాను. విశాఖలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ల విషయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తాం. నీటి వినియోగాన్ని తగ్గించే ఎయిర్ కూలింగ్ వంటి సాంకేతికతలకు ప్రాధాన్యం ఇస్తాం” అని అన్నారు.
దేశంలో విశాఖను నంబర్ వన్ సిటీగా నిలబెడతాం
“విశాఖపట్నం వేగంగా రూపాంతరం చెందుతోంది. ఏఐజీ హాస్పిటల్‌కు శంకుస్థాపన చేసుకున్నాం. రెండేళ్లలో 650 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతుంది. హైదరాబాద్‌ను చంద్రబాబు గారు అభివృద్ధి చేసిన విధంగా విశాఖపట్నం అభివృద్ధిలో కూడా ఒక కొత్త బెంచ్‌మార్క్ సృష్టించబోతున్నాం. విశాఖపట్నం నంబర్ వన్‌గా ఉండాలి. దేశంలోని మోడల్ సిటీల్లో ఒకటిగా విశాఖను అభివృద్ధి చేస్తాం” అని స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని, ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వం అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అని చెప్పడం లేదని, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని అవసరమైన చోట సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, విష్ణు కుమార్ రాజు, ఫ్రీ పోలియో సర్జికల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్మన్ రొక్కమ్ శశి ప్రభ, విశాఖ హరే కృష్ణ మూవ్ మెంట్ అధ్యక్షులు నిస్కించన భక్త దాస, ఫౌండేషన్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.








