Kondapalli: విద్యార్థులతో… విద్యార్థుల్లో ఒకరుగా మంత్రి ‘ కొండపల్లి ‘
– లొట్టపల్లి జడ్పీ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి
– విద్యార్థులతో వాలీబాల్ ఆడి.. నేలపై కూర్చొని భోజనం
– గరిటె పట్టి వడ్డన.. పౌష్టికాహరం విషయంలో రాజీ వద్దని ఆదేశాలు
– మంత్రి రాకతో విద్యార్థుల్లో నూతనోత్సాహం
విజయనగరం, మార్చి 31 : ఒకవైపు రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలు.. మరోవైపు ఎమ్మెల్యేగా క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఓ సామాన్యుడిలా, ఓ క్రీడాకారుడిగా మారిపోయి విద్యార్థులతో మమేకమయ్యారు. జామి మండలం లొట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రొటోకాల్ ఆడంబరాలకు దూరంగా.. విద్యార్థుల్లో ఒకడిగా కలిసిపోయి వారి సాధక బాధకాలను తెలుసుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా హత్తుకుంది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ముందస్తు సమాచారం లేకుండా మంత్రి పాఠశాలను సందర్శించారు. ముందస్తు సమాచారం లేకుండా మంత్రి ఒక్కసారిగా రావడంతో అందరూ ఒకింత ఆశ్చర్యపోయినా తర్వాత మంత్రి అత్మీయతకు వారంతా మంత్రముగ్ధులయ్యారు.
ఇవి కూడా చదవండి

విద్యార్థుల తరగతి గదుల్లోకి వెళ్లిన మంత్రి వారి చదువులు ఎలా సాగుతున్నాయో తెలుసుకున్నారు. బోధన ఎలా ఉందని అడగడంతో పాటు ఏమైనా సమస్యలు ఉంటే భయం లేకుండా తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. మంత్రి పాఠశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే వాలీబాల్ ఆడుతోన్న విద్యార్థులు కనిపించారు. వెంటనే తనలోని క్రీడాకారుడిని బయటకు తీశారు. వారితో కలిసి వాలీబాల్ ఆడి వారిని ఉత్సాహ పరిచారు. మధ్యాహ్న భోజన సమయంలో భోజనశాలను తనిఖీ చేసి, గరిటె పట్టి వారికి భోజనం వడ్డించి… విద్యార్థులతో కలిసి స్వయంగా భోజనం చేశారు. ప్రతి రోజు భోజనం ఎలా ఉంటుందో ? కూడా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంలో ఎక్కడా రాజీపడకూడదని అధికారులకు, వంట ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. తమ మధ్యకు ఒక సామాన్యుడిలా వచ్చిన తీరుకు విద్యార్థుల్లో నూతనోత్సాహం వ్యక్తమైంది.
ఇవి కూడా చదవండి








