Chandrababu: వ్యవసాయం, అనుబంధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 03 : ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు.. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. దీనిని సమర్థవంతగా అమలు చేస్తూ… 2030-31 నాటికి 40 లక్షల మంది రైతులు, 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సాగు చేపట్టేలా చూడాలని స్పష్టం చేశారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రసాయన ఎరువుల వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని, దీంతో రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి, పంట ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందన్నారు. ప్రకృతి సాగు ఉత్పత్తుల నాణ్యత తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం కల్పించాలన్నారు. అలాగే వ్యవసాయ విద్యార్ధులు ప్రకృతి సాగు చేయడం ద్వారా దాని వల్ల వచ్చే ఫలితాలను స్వయంగా తెలుసుకునేలా చేయాలన్నారు. ప్రకృతి సాగుకు సంబంధించి ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్ వంటివి ఈ ఏడాది ఏప్రిల్ కల్లా వచ్చేలా చూడాలని ఆదేశించారు. అలాగే జూన్ నాటికి రాష్ట్రమంతటా పూర్తి కావాలని ముఖ్యమంత్రి సూచించారు. సుభాష్ పాలేకర్‌తో రాష్ట్రమంతటా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని సీఎం చెప్పారు. అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా అధికంగా ఉండేలా చూడాలన్నారు.
ఎల్నీనో ఎదుర్కొనేలా ప్రణాళికలు
రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు నష్టపోకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని… వర్షాభావ పరిస్థితులు నెలకొనే ప్రాంతాల్లో సంప్రదాయ పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఏఐ ఆధారిత క్రాప్ అడ్వయిజరీ ‘భారత్ విస్తార్’ వంటి వాటిని రాష్ట్రంలోనూ వినియోగించుకోవాలన్నారు. రాయలసీమలో ఒకప్పుడు నీటి సమస్య ఉండేది… సమర్ధ నీటి నిర్వహణతో ఈ ఏడాది ఆ సమస్యను తీర్చాం… అన్ని రిజర్వాయర్లు నింపడంతో సాగునీటికి లోటు లేకుండా చేశామన్నారు. యూఎస్, ఈయూతో ట్రేడ్ ఒప్పందం నేపథ్యంలో రాష్ట్రం నుంచి రొయ్యలు, ఎండుమిర్చి, మామిడి, వరి, ప్రాసెస్డ్ ఫుడ్ ఎగుమతులు పెంచుకునేందుకు మరింత అవకాశం కలిగిందని అధికారులు వివరించగా…, అయితే నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చూడాలని సీఎం అన్నారు.
ఇకపై ఆక్వా సాగు నమోదు తప్పనిసరి
ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్, మార్కెటింగ్… ఇలా అన్ని అంశాలు అంతర్జాతీయ స్థాయిలో కోకో సిటీలో ఉండాలన్నారు. మామిడి, కోకో, జీడిమామిడి, కొబ్బరి తోటల్లో అంతర్ పంటల సాగుకు అవకాశాలు ఉన్నాయని… రైతుల్ని ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. అరటి ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నప్పటికీ… ఎగుమతుల విషయంలో వెనకబడ్డామని, ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో పీపీపీ విధానంలో లంబసింగిలో పెద్దఎత్తున కుంకుమపువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలన్నారు. ఆక్వా సాగు వివరాలను రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. పౌల్ట్రీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్ట్‌ను రైతులకే ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. వ్యవసాయం, అనుబంధం రంగాలకు సంబంధించి కేంద్ర పాలసీలకు అనుగుణంగా రాష్ట్ర పాలసీలు ఉండాలని చెప్పారు.
పంటల ప్రాముఖ్యత తెలిసేలా ఫెస్టివల్స్
కుప్పంలో ఫ్లవర్ ఫెస్టివల్ నిర్వహించినట్టే మన పంటలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పలు ఫెస్టివల్స్ నిర్వహణకు ఆలోచన చేయాలని, దీంతో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం అవుతుందన్నారు. అవసరమైతే కేంద్రంతో మాట్లాడి మన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైల్ బోగీలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. హార్టీకల్చర్, ఆక్వాకు ఏపీ గమ్యస్థానంగా ఉందని… ఈ పంట, శాటిలైట్ సమాచారం ద్వారా దిగుబడి అంచనా వేసి, అందుకు అనుగుణంగా మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. ఫ్రూట్ కవర్లతో మామిడికి మంచి నాణ్యత-ధర వచ్చిందని, జామ, దానిమ్మ వంటి పండ్ల తోటలకు ఈ విధానాన్ని అనుసరించేలా చూడాలని సీఎం చెప్పారు. ఫుడ్ క్లస్టర్ల వారీగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకున్న సంస్థలు త్వరితగతిన నెలకొల్పేలా సంప్రదింపులు జరపాలన్నారు. త్వరలో మామిడి ప్రాసెసింగ్ యజమానులతో సమావేశం నిర్వహించి, వారి సమస్యలు పరిష్కరిద్దామని సీఎం చెప్పారు.
పీపీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్
మార్కెట్ యార్డులు ఉన్నచోట రైతు బజార్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన చోట రైతు బజార్లను ఆధునీకరించాలన్నారు. విజయవాడలో పీపీపీ విధానంలో ఫ్లవర్ మార్కెట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. సమీక్షలో డిజి రైతు బజార్ యాప్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా కూరగాయలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసుకునే అవకాశం కలుగుతుంది. అలాగే ఫార్మ్ మిషనరీ కోసం ఏపీఏఐఎంఎస్ యాప్‌ను, కిసాన్ డ్రోన్ యాప్‌ను ప్రారంభించారు. రైతులు తమకు అవసరమైన ట్రాక్టర్లు, డ్రోన్లు, గడ్డికోత మిషన్లు, పవర్ టిల్లర్లు, బేలర్లను బుక్ చేసుకుని సేవలు పొందవచ్చు. రాష్ట్రంలో మొత్తం 9,512 యంత్రపరికరాలను ఇందుకు సిద్ధంగా ఉంచారు. ఇకపై రైతులే నేరుగా ఈ క్రాప్‌ను నమోదు చేసుకునే వెసులుబాటుపై వారికి అవగాహన కల్పించాలని, అలాగే వారి సందేహాలు నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






