టెక్నాలజీ హబ్‌గా ఏపీ.. డిసెంబర్ నుంచి అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ ప్రారంభం!
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం సాంకేతికతను అనుసరించడమే కాకుండా, దానిని సృష్టించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం (SRM) యూనివర్సిటీలో దేశంలోనే తొలి క్వాంటం టెస్ట్బెడ్స్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన కీలక ప్రకటనలు చేశారు.
45 లక్షల మందికి నైపుణ్య శిక్షణ:
రాష్ట్రంలోని సుమారు 45 లక్షల మందిని ఏఐ (AI), క్వాంటం టెక్నాలజీ, , డేటా సెక్యూరిటీ రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. ఐఐటీ చెన్నై, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంకేతిక రంగంలో అమరావతి ప్రాధాన్యతను పెంచుతూ, ఈ ఏడాది డిసెంబర్ నుంచి ‘క్వాంటం వ్యాలీ’ ప్రారంభం కానుందని సీఎం ప్రకటించారు.
స్టార్టప్ ఎకోసిస్టమ్: ప్రతి వెయ్యి మందికి ఒక స్టార్టప్‌ను తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ‘వన్ ఫ్యామిలీ – వన్ ఆంత్రప్రెన్యూర్’ విధానాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా వైద్యం, వ్యవసాయం, రక్షణ , లాజిస్టిక్స్ రంగాల్లో వినూత్న మార్పులు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సింగిల్ విండో విధానం:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్యూబిట్‌ఫోర్స్ సీఈవో ఎల్. వెంకట సుబ్రమణ్యం మాట్లాడుతూ.. అమరావతిలో ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే కేవలం నాలుగు నెలల్లోనే క్వాంటం బెడ్లను సిద్ధం చేయగలిగామని ప్రశంసించారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు లభించడం తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిందని, దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ను తయారు చేయడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.






