Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్లో ఏపీకి బూస్ట్… కొబ్బరి, జీడి రైతులకు ఊరట, మైనింగ్ మిషన్‌కు గ్రీన్ సిగ్నల్
ఆదివారం లోక్‌సభలో (Loksabha) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా రైతులు, తీర ప్రాంతాలు, ఖనిజ వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చేసిన ప్రకటనలు రాష్ట్రానికి మేలు చేసేలా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ కొబ్బరి రైతులకు ఊరటనిచ్చే ప్రకటనలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలు (East & West Godavari Districts) ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (Dr. B.R. Ambedkar Konaseema District)లో కొబ్బరి ప్రధాన పంటగా ఉంది. అలాగే శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) తీర ప్రాంతాల్లోనూ కొబ్బరి సాగు విస్తృతంగా ఉంది. ఈ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని తీర ప్రాంతాల్లో కొత్త కొబ్బరి తోటల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, పాతవి ఫలించని చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి వెల్లడించారు. దీని వల్ల రైతుల ఆదాయం పెరగడంతో పాటు దీర్ఘకాలికంగా పంట ఉత్పాదకత కూడా మెరుగవుతుందని భావిస్తున్నారు.
అలాగే జీడిపప్పు సాగుపై కూడా కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. రాజోలు నియోజకవర్గం (Rajolu Constituency)లోని మోరి (Mori) ప్రాంతం, శ్రీకాకుళం జిల్లాలోని పలాస (Palasa) జీడిపప్పు ఉత్పత్తికి దేశవ్యాప్తంగా పేరుగాంచిన కేంద్రాలు. ఈ ప్రాంతాల్లో జీడిపప్పు సాగు, ప్రాసెసింగ్, విలువ పెంపు చర్యలకు కేంద్రం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. దీంతో పలాస ప్రాంతం రాష్ట్రంలోనే అతిపెద్ద జీడిపప్పు హబ్‌గా మరింత బలపడే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఖనిజ వనరుల అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు కీలక ప్రకటన వచ్చింది. రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) అవసరం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఖనిజ సంపద ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోగ్రామ్‌లు అమలు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఒడిశా (Odisha), కేరళ (Kerala), తమిళనాడు (Tamil Nadu)తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది పరిశ్రమల అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాలకు దోహదపడుతుందని అంచనా.
ఈ బడ్జెట్‌పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి ప్రాధాన్యం దక్కడం ఆనందకరమని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కొబ్బరి, జీడిపంటలకు మద్దతు లభించడం రైతులకు పెద్ద ఊరటగా మారుతుందని పేర్కొన్నారు. అలాగే విదేశీ ప్రయాణాలపై పన్ను తగ్గింపు, ఏడు నగరాల మధ్య హైస్పీడ్ కారిడార్లు, పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, డేటా సెంటర్ల ఏర్పాటుకు తోడ్పాటు వంటి నిర్ణయాలు దేశ అభివృద్ధిని వేగవంతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి జిల్లాలో బాలికల వసతి గృహాల ఏర్పాటు సామాజికంగా కీలకమైన అడుగుగా అభివర్ణించారు. మొత్తంగా ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






