ట్రంప్ నకు యూఎస్ ప్రతినిధుల సభలో భారీ షాక్..!
ఇరాన్ పై సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికలు చిత్తయ్యాయి. ముఖ్యంగా యుద్ధం అనకుండా సైనిక చర్య అనడం ,, అదికూడా ముగిసిపోయిందని చెప్పి, ఇబ్బంది లేకుండా చూసుకుందామనుకున్నా.. యూఎస్ ప్రతినిధుల సభ ముందు ట్రంప్ పప్పులుడకలేదు. ఇరాన్ పై ట్రంప్, ఆయన మంత్రివర్గం, పెంటగాన్ ఎన్ని కబుర్లు చెప్పినా.. యూఎస్ ప్రతినిధులసభ మాత్రం.. సంచలన తీర్మానం ఆమోదించింది. ట్రంప్ దూకుడుకు పగ్గాలేసింది.
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు తక్షణమే బ్రేక్ వేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్ ప్రతినిధుల సభ (House of Representatives) బుధవారం ఒక సంచలన ‘వార్ పవర్స్ రిజల్యూషన్’ (యుద్ధ అధికారాల తీర్మానం)ను ఆమోదించింది. మూడు నెలలుగా సాగుతున్న ఈ అంతర్జాతీయ సైనిక ఘర్షణను ముగించేందుకు ప్రతిపక్ష డెమొక్రాట్లతో పాటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన సొంత పార్టీ (రిపబ్లికన్) సభ్యులు కూడా చేతులు కలపడం సిలికాన్ వ్యాలీతో పాటు వాషింగ్టన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ ఓటింగ్ ఫలితం నేరుగా అధ్యక్షుడు ట్రంప్ దూకుడుకు ఒక గట్టి సవాల్‌గా నిలిచింది.
సభలో బుధవారం జరిగిన హోరాహోరీ ఓటింగ్‌లో ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 208 ఓట్లు పడ్డాయి. అయితే, ఈ తీర్మానం సభలో నెగ్గినప్పటికీ, దీని భవిష్యత్తు, తుది అమలుపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఓటింగ్ జరగకుండా, తద్వారా ఇరాన్ యుద్ధంపై సొంత ప్రభుత్వంలోనే ఉన్న వ్యతిరేకత బయటపడకుండా చూసేందుకు హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ తీవ్రంగా శ్రమించారు. రెండు వారాల క్రితం ఈ తీర్మానం ఆమోదం పొందేలా కనిపించినప్పుడు.. స్పీకర్ జాన్సన్ సభా కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసి కాలయాపన చేశారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులలో పెరుగుతున్న అసంతృప్తిని ఆయన అడ్డుకోలేకపోయారు.
ఇరాన్‌తో అమెరికా చేస్తున్న యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటం, మరోవైపు ఈ సంక్షోభాన్ని ముగించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేగవంతమైన చర్చలు జరపడంలో విఫలం కావడమే ఈ రాజకీయంగా ఎదురుదెబ్బకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ముగింపునకు సంబంధించిన శాంతి ప్రణాళికను (Peace plan) ముందుకు తీసుకెళ్లడంలో ట్రంప్ ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో, అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవైపు ఇజ్రాయెల్-లెబనాన్ల మధ్య శాంతి చర్చలు ఫలించిన తరుణంలో.. ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను సొంత పార్లమెంటే తప్పుబట్టడం ట్రంప్ యంత్రాంగాన్ని ఆత్మరక్షణలో పడేసింది.








