‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’కు ట్రంప్ బ్రేక్.. కీలక నిర్ణయం వెనక..?
హర్మూజ్ ఫ్రీడమ్ ప్లాన్ విషయంలో ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ (Project Freedom)కు బ్రేక్ పడింది. ఇరాన్‌తో దౌత్య చర్చల్లో పురోగతి నేపథ్యంలో.. దీన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) ప్రకటించారు.
పాకిస్థాన్ (Pakistan), ఇతర దేశాల అభ్యర్థన మేరకు, ఇరాన్‌పై సాధించిన విజయాన్ని దృష్టిలోపెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ క్రమంలో ఇరాన్ (Iran) ప్రతినిధులతో ఒక సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా కొనసాగుతోన్న ప్రయత్నాల్లో పురోగతి సాధించామన్నారు. ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనం మాత్రం కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఒప్పందంపై పూర్తి స్పష్టత వచ్చేంతవరకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.
ఇరాన్ బహిరంగ ప్రకటనలకు విరుద్ధంగా తమతో ఒక ఒప్పందం చేసుకునేందుకు రహస్యంగా ప్రయత్నిస్తుందని ట్రంప్ అన్నారు. ఈసందర్భంగా ఇరాన్ లొంగిపోవాలని ఆయన హెచ్చరించారు. తాము పూర్తిస్థాయిలో పోరాటానికి దిగితే.. వారు దాన్ని ఆపలేరని వ్యాఖ్యానించారు.
అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ (Strait of Hormuz) మీదుగా నౌకల రాకపోకలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో విదేశీ నౌకలను జలసంధి నుంచి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే ఉద్దేశంతో ట్రంప్ ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రకటించారు. దీన్ని మానవతా చర్యగా అభివర్ణించారు. కాగా.. ఇది ప్రారంభమైన కొన్ని గంటలకే తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి






