Iran Missile: ఇరాన్ క్షిపణులపై ‘థాంక్యూ ఇండియా’..ఇజ్రాయెల్‌పై దాడి వేళ వైరల్ అవుతున్న ఫోటోలు..!
ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్(Iran – Israel) మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో ఒక వింత పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన భారీ క్షిపణులపై భారత్ కు(India) కృతజ్ఞతలు తెలుపుతూ రాసిన సందేశాలు కనిపించడం అంతర్జాతీయ స్థాయిలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ సిబ్బంది ఇజ్రాయెల్‌పైకి క్షిపణులను ప్రయోగించే ముందు వాటిని సిద్ధం చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ క్షిపణులపై “భారత ప్రజలారా, ధన్యవాదాలు” (Thank You People of India), “థాంక్యూ ఇండియా”(Thank You India) వంటి సందేశాలు స్పష్టంగా రాసి ఉన్నాయి.
ఇరాన్ సైనిక సిబ్బంది స్వయంగా ఈ అక్షరాలను క్షిపణులపై రాస్తున్న ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇరాన్ ఈ విధంగా కృతజ్ఞతలు తెలపడం వెనుక కొన్ని కీలక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ, భారత్ ఇరాన్‌తో దౌత్యపరమైన, వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఈ మద్దతుకు గుర్తుగా ఇరాన్ ఇలా స్పందించి ఉండవచ్చు. భారత్, ఇరాన్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న చాబహార్ వ్యూహాత్మక ఓడరేవు ప్రాజెక్టు ఇరు దేశాల మధ్య బలమైన బంధానికి నిదర్శనం.
సోషల్ మీడియాలో ఇరాన్ చర్యలకు మద్దతుగా వస్తున్న కొన్ని కామెంట్లను దృష్టిలో ఉంచుకుని ఇరాన్ సైన్యం ఈ సందేశాన్ని రాసి ఉండవచ్చని సమాచారం. సాధారణంగా యుద్ధ సమయంలో క్షిపణులపై శత్రువులను హెచ్చరించేలా రాస్తుంటారు. కానీ, ఒక దేశానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా రాయడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ప్రచారంలో భాగంగా చేసినదా లేక ఇరు దేశాల మధ్య ఉన్న లోతైన సంబంధానికి సంకేతమా అన్నది చర్చనీయాంశంగా మారింది.








