Israel: ఇజ్రాయిల్ లో ఇరాన్ క్షిపణి సింహగర్జన..!
ఇరాన్ క్షిపణి వ్యవస్థలో అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే ‘సెజ్జిల్’ (Sejjil) క్షిపణి గురించి ప్రస్తుతం అంతర్జాతీయ రక్షణ రంగంలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ తన అమ్ములపొదిలోని ఈ ‘బ్రహ్మాస్త్రాన్ని’ బయటకు తీసింది. సెజ్జిల్ క్షిపణికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు దాని ప్రత్యేకతలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడమే. సెజ్జిల్ అనేది ఇరాన్ సొంతంగా అభివృద్ధి చేసుకున్న మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్. దీనిని మొదటిసారిగా 2008లో పరీక్షించారు.
అప్పటి నుండి ఇప్పటివరకు ఇందులో అనేక ఆధునిక మార్పులు చేస్తూ వచ్చారు. సెజ్జిల్ క్షిపణికి ఉన్న అతిపెద్ద బలం ఇది ఘన ఇంధనంతో నడుస్తుంది. సాధారణంగా ద్రవ ఇంధనం వాడే క్షిపణులను ప్రయోగించడానికి చాలా సమయం పడుతుంది. కానీ, సెజ్జిల్ను కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రయోగించడానికి సిద్ధం చేయవచ్చు. దీనివల్ల శత్రువుల నిఘా కళ్లకు దొరకకుండా మెరుపుదాడి చేయడం సాధ్యమవుతుంది. ఈ క్షిపణి సుమారు 2,000 నుండి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలదు.
దీని అర్థం ఇరాన్ భూభాగం నుండి ప్రయోగిస్తే.. ఇజ్రాయెల్, ఈజిప్ట్, సౌదీ అరేబియా(Saudi Arabia) మరియు తూర్పు ఐరోపాలోని అనేక ప్రాంతాలను ఇది సులభంగా తాకగలదు. సెజ్జిల్ క్షిపణి గాలిలో ప్రయాణించే వేగం శత్రువుల డిఫెన్స్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ ‘ఆరో’ లేదా అమెరికా(America) ‘పాట్రియాట్’ కు అందనంత వేగంగా ఉంటుంది. ఇది వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు మాక్ 12 నుండి 14 వేగంతో ప్రయాణిస్తుందని అంచనా. ఇది సుమారు 500 నుండి 1,000 కిలోగ్రాముల బరువున్న పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.
భవిష్యత్తులో దీనికి అణు వార్హెడ్లను అమర్చే అవకాశం కూడా ఉందని పాశ్చాత్య దేశాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిని ట్రక్కుల వంటి మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడికైనా తరలించవచ్చు. ఒకచోట ప్రయోగించిన వెంటనే మరో చోటికి తరలించడం వల్ల శత్రువుల ఎదురుదాడి నుండి క్షిపణి లాంచర్లను కాపాడుకోవచ్చు. ఇరాన్-అమెరికా ఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ తన భూగర్భ బంకర్ల (Missile Cities) నుండి సెజ్జిల్ క్షిపణులను బయటకు తీసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్ను నేరుగా టార్గెట్ చేయగల సామర్థ్యం ఉండటంతో, ఈ క్షిపణి పేరు వింటేనే అగ్రరాజ్యాలు అప్రమత్తమవుతున్నాయి. సాంకేతిక పరంగా చూస్తే, ఇరాన్ తయారు చేసిన క్షిపణులలో సెజ్జిల్ అత్యంత అధునాతనమైనది. శత్రువులకు ముందస్తు హెచ్చరిక ఇచ్చే అవకాశం లేకుండా దాడి చేయగల దీని సామర్థ్యమే దీనిని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన క్షిపణుల జాబితాలో నిలబెట్టింది.








