Qeshm Island: ఇరాన్ ఆయుధ నగరం ఖేష్మ్.. గురిపెట్టిన ట్రంప్..!
అమెరికా, ఇజ్రాయెల్ కలిసికట్టుగా దాడి చేస్తున్నా ఇరాన్ ఏమాత్రం భయపడడం లేదు. తమ లీడర్లను వెతికి , వెంటాడి వధిస్తున్నా.. తగ్గేది లేదు.. అమరులమవుతామని ఢంకా బజాయించి మరీ చెబుతోంది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ కు ఏమాత్రం మింగుడు పడడం లేదు. మొన్నటికి మొన్న ఖర్గ్ ను పట్టేస్తామని హెచ్చరించిన ఈదేశాలు.. ఇప్పుడు ఇరాన్ ఆయుధనగరిపై కన్నేశాయి. అదే ఖేష్మ్.. దాన్ని కూలిస్తేనే..యుద్ధంలో గెలుపు సాధ్యమని అంచనాకు వచ్చాయి.మరి ఆ ఆయుధనగరి ఖేష్మ్ ఎక్కడుంది..?
పాతాళంలో ఆయుధనగరి ఖేష్మ్…
హర్మూజ్ జలసంధిలోని ఓ భారీ దీవి ఇరాన్ (Iran) కు పెట్టని కోట.. దాదాపు 1,445 చదరపు కిలోమీటర్లున్న ఈ దీవి ఉప్పు రాతిశిలలతో ఏర్పడింది. దీని పాతాళంలో ఏకంగా ఓ మృత్యు నగరమే ఉంది. ఒకప్పుడు ఓపెన్ మ్యూజియంగా పేరున్న ఈ ప్రదేశం ఇప్పుడు ఇరాన్ (Iran) అండర్‌గ్రౌండ్ మిసైల్ సిటీగా మారింది.
ఈ ప్రదేశంలోని దుర్భేద్యమైన భూగర్భ గుహలను ఇరాన్ (Iran) తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం సైనిక స్థావరంగా మార్చేసింది. దీనిలో సొరంగ మార్గాల్లో క్షిపణులు, ఇతర ఆయుధాలను భద్రపర్చింది. భూకంపాలు వచ్చినా తట్టుకొనేలా దీనిని సిద్ధం చేసింది. తగిన వెంటిలేషన్, అత్యవసర విద్యుత్తు సరఫరా, క్షిపణులను వేగంగా తరలించేందుకు రైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఇరాన్ తలుచుకొంటే ఈ మిసైల్ సిటీ సాయంతో హర్మూజ్‌ను తక్షణమే మూసేయగలదు. దీంతోపాటు ఇరాన్, ఖేష్మ్ మధ్య ఉన్న క్లారెన్స్ అనే జలసంధిని కూడా ఇక్కడి నుంచే నియంత్రించవచ్చు.
ఇక్కడ ఇరాన్‌కు చెందిన యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులు ఉన్నాయి. జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడతారు. గడా 380, హెచ్‌వై-2 సిల్క్వార్మ్ను ఇక్కడ సిద్ధంగా ఉంచింది. ఇక బాలిస్టిక్ మిసైల్స్‌లో 800 కిలోమీటర్ల రేంజి ఉన్న ఖియామ్-1, ఖైబర్ షెకన్, ఘద్ర, ఎమాద్ మిసైల్స్‌ను భద్రపర్చింది. వీటితోపాటు వేగంగా దాడి చేసే స్పీడ్‌బోట్స్, తీరప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఉన్నాయి.
మార్చి 7వ తేదీన ఇక్కడి ఉప్పునీటి శుద్ధి కర్మాగారంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసి ధ్వంసం చేశాయి. ఆ వెంటనే బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ (Iran) దాడి చేయడం.. ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది.
ఇవి కూడా చదవండి
గతంలో పోర్చుగీస్, బ్రిటిష్ సామ్రాజ్యాధిపతులు ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకొని పాలించారు. హర్మూజ్ పాలకులు 1301లో టార్టర్ల దాడుల నుంచి తప్పించుకోవడానికి మొత్తం సంస్థానాన్నే ఈ ద్వీపానికి తరలించారు. ఇది నీటి నిల్వలకు చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. 1552లో అట్టమాన్ కమాండర్ పీరి రీస్ దీనిని స్వాధీనం చేసుకొన్నాడు. ఆ తర్వాత పోర్చుగీస్, బ్రిటీష్ ఇండియా పాలించాయి. తర్వాత రెజా షా పహ్లావి పాలన మొదలైంది. ఆ తర్వాత ఇది ఇరాన్ (Iran) చేతికి వెళ్లింది.
హర్మూజ్‌పై అమెరికా పట్టు సాధించాలంటే..
ప్రపంచ చమురు వాణిజ్యానికి కీలక మార్గమైన హర్మూజ్‌ను గుప్పిట బంధించాలంటే ఇరాన్ (Iran) చమురు గుండెకాయ ఖర్గ్ ద్వీపంతో పాటు ఖేష్మ్ మిసైల్ సిటీని కూడా నిర్వీర్యం చేయడం అమెరికాకు చాలా ముఖ్యం. ఈ క్రమంలో మంగళవారం అమెరికా హర్మూజ్ సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరాలపై జీబీయూ-72 అడ్వాన్స్డ్ 5కే పెనట్రేటర్లతో విరుచుకుపడింది. ఈ మేరకు సెంట్రల్ కమాండ్ మార్క్ చేసిన లొకేషన్ కూడా ఖేష్మ్ ఐలాండ్‌కు చాలా దగ్గర్లోనే సూచిస్తోంది. ఈ రకం బాంబులు అమెరికా సర్వీసులోకి 2021లో ప్రవేశించాయి. జీపీఎస్ గైడెన్స్‌తో ఇవి లక్ష్యాన్ని ఛేదించగలవు. కొన్నిరకాల పరిస్థితులు తలెత్తగానే పేలిపోయేలా వీటిని తయారుచేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇవి లక్ష్యాన్ని చేరుకొంటాయి. మరోవైపు ఖర్గ్‌లోని ఇరాన్ (Iran) సైనిక స్థావరాలను అమెరికా తుడిచిపెట్టింది.








