వేసవిలో గుండె పదిలం.. ఈ చిన్న మార్పులతో గుండె జబ్బులకు చెక్!
Heart Health: ఎండలు ముదురుతున్న వేళ ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఆహారం, వ్యాయామం మాత్రమే సరిపోవు. జీవనశైలిలో చేసే చిన్న చిన్న మార్పులు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో హార్ట్ ఎటాక్, హీట్ స్ట్రోక్ వంటి ముప్పుల నుండి తప్పుకోవడానికి ఈ క్రింది చిట్కాలు పాటించండి.
1. గోరువెచ్చని నీరు..
రోజును ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో ప్రారంభించండి. కాఫీ, టీలకు బదులుగా నీరు తాగి, ఒక ఐదు నిమిషాల పాటు ఒళ్లు విరుచుకోవడం (స్ట్రెచింగ్) లేదా చిన్నపాటి నడక చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఇవి కూడా చదవండి
2. చిరుధాన్యాలు..
నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండండి. మీ భోజనంలో సగం భాగం పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. జున్నలు, రాగులు వంటి చిరుధాన్యాలు (మిల్లెట్స్) , పప్పుధాన్యాలను డైట్లో చేర్చుకోండి. ప్యాక్ చేసిన ఫుడ్ కంటే ఇంట్లో వండిన స్నాక్స్ శ్రేయస్కరం.
3. ఒత్తిడికి దూరంగా..
గుండె ఆరోగ్యంపై మానసిక ఒత్తిడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి అనిపించినప్పుడు దీర్ఘ శ్వాస తీసుకోవడం, పది నిమిషాల పాటు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. మీ మనసులోని భావాలను డైరీలో రాయడం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
4. రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర..
గుండెకు సరైన విశ్రాంతి అవసరం. అందుకే రోజుకు కనీసం 7 నుండి 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రపోయే ముందు మొబైల్, టీవీ స్క్రీన్లకు దూరంగా ఉండటం వల్ల గాఢ నిద్ర పడుతుంది.
5. క్రమం తప్పకుండా వ్యాయామం..
వ్యాయామం అంటే కేవలం జిమ్‌కు వెళ్లడం మాత్రమే కాదు. నచ్చిన పాటలకు డ్యాన్స్ చేయడం, పెంపుడు జంతువులతో వాకింగ్ చేయడం లేదా యోగా వంటివి కూడా గుండెను పదిలంగా ఉంచుతాయి. ఇది బరువును అదుపులో ఉంచి రక్తపోటు సమస్యలను తగ్గిస్తుంది.
6. ఆరోగ్యకరమైన పానీయాలు..
ధూమపానం, మద్యం , అతిగా కాఫీ తాగడం గుండెపై భారాన్ని పెంచుతాయి. వీటిని ఒకేసారి మానేయలేకపోయినా, క్రమంగా తగ్గించుకుంటూ రావాలి. ఉదాహరణకు కాఫీకి బదులుగా గ్రీన్ టీ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోవచ్చు.
7. కనీసం 8 నుండి 9 గ్లాసుల నీరు..
వేసవిలో శరీరంలో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కగా మారి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రోజుకు కనీసం 8 నుండి 9 గ్లాసుల నీరు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు వెంట నీళ్ల బాటిల్ ఉంచుకోవడం వల్ల హీట్ స్ట్రోక్ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు.
ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే వేసవి తాపాన్ని తట్టుకోవడమే కాకుండా గుండెను కూడా దృఢంగా ఉంచుకోవచ్చు.
ఇవి కూడా చదవండి








