ఈత సరదా ప్రాణగండం కావొద్దు అంటే.. ఈ జాగ్రత్తలు మస్ట్!
Swimming Safety:వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు నగరవాసులు ఈత కొలనుల వైపు అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో, స్విమ్మింగ్ పూల్స్‌కు వచ్చే చిన్నారులు , యువత సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈత కొలనుల వద్ద సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోతే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సరైన బ్రీతింగ్ ప్రక్రియ..
ఈత నేర్చుకోవాలనుకునే వారు కేవలం గుర్తింపు పొందిన ఈత కొలనులనే ఎంచుకోవాలి. అక్కడ అనుభవజ్ఞులైన కోచ్‌లతో పాటు ప్రాణాలను కాపాడే లైఫ్ గార్డ్స్ నిరంతరం అందుబాటులో ఉండాలి. కేవలం సరదా కోసం కాకుండా, సరైన బ్రీతింగ్ ప్రక్రియ నేర్చుకున్న తర్వాతే లోతైన ప్రాంతాల్లోకి వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిర్వాహకులు , తల్లిదండ్రులు గమనించాల్సినవి..
కనీసం ఐదేళ్లు నిండిన పిల్లలను మాత్రమే కొలనులోకి అనుమతించాలి. కొలను వద్ద ఎల్లప్పుడూ ఎయిర్ ట్యూబ్‌లు, లైఫ్ జాకెట్లు , తాడులు సిద్ధంగా ఉంచుకోవాలి. నీటిని శుద్ధి చేయడానికి వాడే క్లోరిన్ మోతాదు మించకుండా చూడాలి. క్లోరిన్ ఎక్కువైతే చర్మంపై దద్దుర్లు , ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఫిట్నెస్ సర్టిఫికేట్..
ఈతకు వెళ్లే ముందు ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండటం క్షేమకరం. అలాగే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి ప్రాథమిక చికిత్స (CPR) అందించే సదుపాయం అక్కడ ఉండాలి. సరైన పర్యవేక్షణ, ముందస్తు జాగ్రత్తలు ఉన్నప్పుడే ఈత సరదా సురక్షితంగా సాగుతుందని క్రీడా విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు.








