నేను స్వీట్స్ తినను.. కానీ షుగర్ వచ్చింది… మీకు కూడా ఈ సమస్య ఎదురైందా?
నేను అసలు మిఠాయిలే తినను, స్వీట్ల జోలికే వెళ్లను.. మరి నాకు షుగర్ వ్యాధి ఎలా వచ్చింది? అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కేవలం మిఠాయిలు తింటేనే మధుమేహం వస్తుందనుకోవడం ఒక పెద్ద అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మనం తీసుకునే రోజువారీ ఆహారంలో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు), ప్రొటీన్లు, కొవ్వులు పీచు పదార్థాలు ఉంటాయి. మనం తిన్న పిండి పదార్థాలు జీర్ణక్రియ ప్రక్రియలో విచ్ఛిన్నమై గ్లూకోజ్ వంటి సాధారణ చక్కెరలుగా మారి రక్తంలో కలుస్తాయి. మనకు నేరుగా కనిపించకపోయినా మనం తినే అనేక ఆహార పదార్థాల్లో చక్కెరలు అంతర్లీనంగా ఉంటాయి.
ముఖ్యంగా ఊబకాయం (ఓవర్ వెయిట్) ఉన్నవారిలో చక్కెర లేని ఆహారం తీసుకున్నప్పటికీ మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు వల్ల వాపు ప్రక్రియ (Inflammation) ప్రేరేపితం కావడం అదనపు కొవ్వు ఆమ్లాలు విడుదల కావడం. ఈ పరిస్థితుల్లో శరీర కణాలు ఇన్సులిన్‌కు సరైన రీతిలో స్పందించవు (ఇన్సులిన్ రెసిస్టెన్స్). దీనివల్ల రక్తంలోని గ్లూకోజ్ కణాల్లోకి చేరలేక రక్తంలోనే ఉండిపోతుంది, ఫలితంగా చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ పెరిగిన గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి క్లోమగ్రంథి (Pancreas) మరింత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించి, చివరికి విఫలమవుతుంది. అందుకే కేవలం తీపి పదార్థాలనే కాకుండా, జీవనశైలి శరీర బరువును కూడా గమనించుకోవడం ఎంతో ముఖ్యం.








