Global Oil: చమురు సెగలతో రష్యాకు కాసుల పంట.. రోజుకు రూ.3,700 కోట్ల అదనపు రాబడి
Global Oil: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు చల్లారకపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరలను నియంత్రించి, మార్కెట్లో స్థిరత్వం తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా చమురుపై ఉన్న కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా సడలిస్తూ, ఇప్పటికే నౌకల్లో లోడ్ అయిన చమురు కొనుగోలుకు అమెరికా ట్రెజరీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మార్కెట్ స్థిరత్వం కోసమే:
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ధరలు అదుపు తప్పకుండా చూసేందుకే ఈ తాత్కాలిక చర్యలు చేపట్టినట్లు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అయితే, ఈ మినహాయింపు కేవలం రవాణాకు సిద్ధంగా ఉన్న నిల్వలకు మాత్రమే వర్తిస్తుందని, దీనివల్ల రష్యాకు కొత్తగా ఎలాంటి అదనపు ఆర్థిక ప్రయోజనం ఉండబోదని ఆయన పేర్కొన్నారు. కాగా, భారతీయ రిఫైనరీలకు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే 30 రోజుల మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
మార్కెట్లోకి 19 మిలియన్ బ్యారెళ్ల చమురు:
అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో రష్యాకు చెందిన 30 ట్యాంకర్లలో ఉన్న సుమారు 19 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, అలాగే 3.10 లక్షల టన్నుల రిఫైన్డ్ చమురు ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. దీనిపై రష్యా స్పందిస్తూ.. అంతర్జాతీయ మార్కెట్లకు తమ చమురు ఎంత అవసరమో ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని వ్యాఖ్యానించింది.
రష్యాకు భారీగా అదనపు ఆదాయం:
పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు ధరలు పెరగడం రష్యాకు వరంగా మారింది. పెరిగిన ధరల కారణంగా పుతిన్ ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అమెరికా సెనెట్ విచారణలో సెనెటర్ ఆంగస్ కింగ్ మాట్లాడుతూ.. ఈ యుద్ధం వల్ల రష్యా ఇప్పటికే 6 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయాన్ని పొందిందని అంచనా వేశారు. సగటున రోజుకు దాదాపు 400 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,700 కోట్లు) మేర అదనపు లాభాలను రష్యా గడిస్తోందని, ఈ యుద్ధంలో పుతిన్ స్పష్టమైన విజేతగా నిలుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.








