Shelly Kittleson: ఇరాక్‌లో కలకలం.. అమెరికా మహిళా జర్నలిస్టు కిడ్నాప్.. వేటలో భద్రతా బలగాలు!
ఇరాక్ (Iraq) రాజధాని బాగ్దాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) వ్యవహారాలపై లోతైన విశ్లేషణలు, గ్రౌండ్ రిపోర్టింగ్ అందించే ప్రముఖ అమెరికన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ను (Shelly Kittleson) గుర్తుతెలియని సాయుధ దుండగులు అపహరించారు. ఈ కిడ్నాప్ ఉదంతాన్ని ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఇవి కూడా చదవండి
తప్పించుకున్న దుండగులు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బాగ్దాద్ నగరంలో రెండు కార్లలో వచ్చిన కిడ్నాపర్లు షెల్లీని (Shelly Kittleson) బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఇరాక్ భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై కిడ్నాపర్ల వాహనాలను వెంబడించాయి. ఈ హై-స్పీడ్ ఛేజింగ్‌లో దుండగులకు చెందిన ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. అయితే, జర్నలిస్ట్ షెల్లీ బందీగా ఉన్న మరో కారు మాత్రం భద్రతా బలగాల కళ్లుగప్పి బాగ్దాద్ దక్షిణ ప్రాంతం వైపు ఉడాయించింది.
ప్రస్తుతం ఆమె (Shelly Kittleson) ఆచూకీ కోసం ఇరాక్ నిఘా వర్గాలు (ఇంటెలిజెన్స్), క్షేత్రస్థాయి స్పెషల్ ఫోర్సెస్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. నగరవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ కిడ్నాప్ వెనుక ఉన్న ఉగ్ర ముఠాలు ఏవి, వారి డిమాండ్లు ఏంటి అన్న దానిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ముందే హెచ్చరించిన అమెరికా
కాగా, ఇరాక్‌లో ప్రస్తుతం నెలకొన్న అస్థిర, యుద్ధ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లవద్దని అమెరికా ప్రభుత్వం షెల్లీ కిటిల్సన్ను (Shelly Kittleson) ముందే హెచ్చరించినట్లు సమాచారం. దేశంలో విదేశీ పౌరులకు కిడ్నాప్ ముప్పు తీవ్రంగా పొంచి ఉందని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం గతంలోనే పలుమార్లు అలర్ట్ జారీ చేసింది. ఈ తీవ్ర హెచ్చరికల నడుమ గ్రౌండ్ రిపోర్టింగ్ కోసం సాహసించి వెళ్లిన షెల్లీ (Shelly Kittleson) కిడ్నాప్‌కు గురికావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి








