Iran: మొజ్తాబా ఖమేనీ క్షేమం.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్!
Mojtaba Khamenei: ఇరాన్ నూతన సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై గత కొద్దిరోజులుగా వస్తున్న రకరకాల ఊహాగానాలకు ఆ దేశ అధికారిక మీడియా చెక్ పెట్టింది. మొజ్తాబా క్షేమంగా ఉన్నారంటూ ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ‘ఐఆర్ఐబీ’ (IRIB) ఒక వీడియోను విడుదల చేసింది.
తొలిసారి బహిరంగంగా: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తాబా సుప్రీం నేతగా బాధ్యతలు చేపట్టారు. అయితే బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా విడుదలైన వీడియోలో ఆయన మతపరమైన బోధనలు చేస్తూ కనిపించారు.
ఇవి కూడా చదవండి
మరణంపై పుకార్లు: యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లో జరిగిన దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, లేదా మరణించి ఉంటారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మొజ్తాబా ప్రాణాలతో ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
స్పష్టత లేని సమయం: ఇరాన్ మీడియా ఈ వీడియోను ప్రసారం చేసినప్పటికీ, ఇది ఎప్పుడు చిత్రీకరించారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ, తమ నేత క్షేమంగా ఉన్నారని ప్రజలకు, శత్రు దేశాలకు సందేశం పంపేందుకే ఇరాన్ ఈ వీడియోను విడుదల చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
నాయకత్వ సంక్షోభం: ఇరాన్ అధికార వర్గాల్లో, సైన్యంలో చీలికలు వచ్చాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఈ వీడియో విడుదల ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి








