Global Oil Crisis: హర్మూజ్ బంద్.. ప్రపంచ దేశాల్లో పెరిగిన ఇంధన ఆందోళనలు
Global Oil Crisis: ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మూతపడింది. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న ఈ మార్గం మూసుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు తమ వ్యూహాత్మక నిల్వలను బయటకు తీస్తున్నాయి.
ప్రపంచ దేశాల అప్రమత్తత:
అమెరికా: చమురు ధరలను అదుపు చేసేందుకు ఇప్పటికే 172 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) సహకారంతో దీనిని 400 మిలియన్ బ్యారెళ్లకు పెంచాలని నిర్ణయించింది. అంతేకాకుండా, రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షలను అమెరికా కొంతమేర సడలించింది.
ఆస్ట్రేలియా: తన నిల్వల నుంచి 762 మిలియన్ లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను విడుదల చేసింది. ఇంధన నాణ్యత నిబంధనలను సడలించి, అధిక సల్ఫర్ కలిగిన పెట్రోల్ విక్రయాలకు అనుమతినిచ్చింది.
ఇవి కూడా చదవండి

జపాన్: తన వద్ద ఉన్న 245 రోజుల నిల్వల నుంచి సుమారు 45 రోజులకు సరిపడా (80 మిలియన్ బ్యారెళ్లు) చమురును సరఫరాలోకి తెచ్చింది.
దక్షిణ కొరియా: గత మూడు దశాబ్దాలలో తొలిసారిగా చమురు ధరలపై పరిమితి విధించింది. లీటర్ పెట్రోల్ ధరను 1.17 డాలర్లుగా స్థిరీకరించింది.
భారత్ చర్యలు:
దేశంలో ఇంధన నల్లబజారును అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల చట్టాన్ని అమలు చేస్తోంది. వంట అవసరాల కోసం సాధారణ కోటాకు అదనంగా మరో 48 వేల కిలోలీటర్ల కిరోసిన్‌ను రాష్ట్రాలకు కేటాయించింది. హోటళ్లు, రెస్టారెంట్లలో గ్యాస్‌కు బదులుగా బయోమాస్, బొగ్గు వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడుకునేందుకు తాత్కాలిక అనుమతులు ఇస్తోంది.
పొరుగు దేశాల్లో ఆంక్షలు:
బంగ్లాదేశ్ ప్రభుత్వం విద్యుత్ పొదుపు కోసం ఏసీల వాడకం తగ్గించాలని, ప్రయాణాలు పరిమితం చేసుకోవాలని ప్రజలను కోరింది. ఇక పాకిస్థాన్ ఒక అడుగు ముందుకు వేసి పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించింది.
ఇవి కూడా చదవండి








