పీఓకేలో రణరంగం.. 30 మృతి.. 200 మందికి గాయాలు
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఓకె)లో భద్రతా బలగాలు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో భద్రతా దళాల కాల్పుల్లో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, మరో 200 మంది గాయపడ్డారు. పాకిస్థాన్ నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. రావల్కోట్, బింబేర్, ముజాఫరాబాద్లో పరిస్థితి దారుణంగా ఉంది.
అయితే సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను బట్టి చూస్తే, మృతుల సంఖ్య వందల్లో వున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీఓకే ప్రజలు తొపాకులు, పెట్రో బాంబులతో తమపై దాడులకు దిగుతున్నారని పాక్ భద్రతా బలగాలు ఆరోపిస్తున్నాయి.
అయితే పీఓకే ప్రజల్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటం, పీఓకే వనరుల్ని పంజాబ్ కి తరలించడం, పీఓకే ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీలు మోపడం లాంటి కారణాలతో తిరుగుబాటు మొదలైంది. ఈ అణచివేతపైనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమకు స్వాతంత్రం కావాల్సిందేనని పట్టుపడుతున్నారు. ఈ అల్లర్లు కాస్తా మీర్పూర్, ముజఫరాబాద్, గిల్గిట్, బాల్టిస్తాన్ కి కూడా విస్తరించాయి. దీంతో ఇంటర్నెట్ సేవలను పాక్ నిలిపేసింది.
తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత్….
పీఓకేలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాక్ నుంచి తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు వ్యాప్తి చెందుతున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. పీఓకేలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకే పాక్ ఇలాంటి ప్రచారానికి పాల్పడుతోందని విమర్శించారు. పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.








