భక్తుల కోసం మరిన్ని ఏర్పాట్లు : కేసీఆర్

భక్తుల కోసం మరిన్ని ఏర్పాట్లు : కేసీఆర్

28-04-2017

భక్తుల కోసం మరిన్ని ఏర్పాట్లు : కేసీఆర్

అయుత మహా చండీయాగం తిలకించడానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున భక్తుల కోసం మరిన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఉదయం పూట పూజల అనంతరం మంత్రి హరీష్‌ రావు, ఇతర నిర్వహకులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. చివరి రోజున రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులు వస్తున్నందున అటు వివిఐపిలకు, ఇటు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.

మూడవ రోజు లక్షల సంఖ్యలో భక్తులు రావడంతో తలెత్తిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రాబోయే  రెండు రోజుల పాటు చేయాల్సిన పనులపై దృష్టి సారించారు. పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా  రెట్టింపు సంఖ్యలో భోజనాలు ఏర్పాటు చేయాలని అన్నారు. పులిహోర కూడా అందుబాటులో ఉంచాలని చెప్పారు. మంచినీళ్లు, చల్లా కూడా ఎక్కువగా సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతమున్న క్యూలైన్లకు అదనంగా మరో రెండు క్యూలైన్లు నిర్మించాలన్నారు.  రాత్రికి రాత్రి పనులు పూర్తి కావాలని చెప్పారు. ముఖ్యమంత్రి నిర్దేశించిన మేరకు అదనపు బారికేడ్ల  నిర్మాణం జరుగుతున్నది.