రాహుల్ బృందం వ్యూహం ఏమిటి?

రాహుల్ బృందం వ్యూహం ఏమిటి?

08-07-2019

రాహుల్ బృందం వ్యూహం ఏమిటి?

గత ఎన్నికల తరువాత కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్‌లో ఆ పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయంలో స్పష్టత రాకపోవడం, మరోవైపు రాజీనామాను వెనక్కి తీసుకునేందుకు రాహుల్‌ గాంధీ నసేమిరా అనడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఓ విధమైన అనిశ్చిత పరిస్థితి కనిపిస్తోంది.

దానికితోడు పార్టీలో కొత్త పవనాలు క్రమంగా బలపడుతుండడంతో రాహుల్‌ బందం భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. మరోపక్క రాహుల్‌ గాంధీ విధేయుల రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్‌ (వెస్ట్‌) బాధ్యతలు నిర్వహిస్తున్న జ్యోతిరాధిత్య సింధియా, ముంబయి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మిలింద్‌ దేవర తమ పదవులకు రాజీనామా చేశారు. రాహుల్‌ గాంధీయే పార్టీ వైఫల్యానికి బాధ్యత వహించి రాజీనామా చేయడంతో ఒక్కరొక్కరుగా పార్టీ సీనియర్‌ నేతల నిష్క్రమణలు సాగుతున్నాయి. అయితే, ఈ రాజీనామాలన్నీ కూడా రాహుల్‌ గాంధీ టీమ్‌కు చెందిన సభ్యుల నుంచే కావడం గమనార్హం. ఏఐసీసీ కార్యదర్శి మొదలుకుని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుల వరకు ఒక్కరొక్కరుగా తప్పుకోవడంతో మొత్తం పార్టీలోనే అనిశ్చితి ఆవహించే పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా రాహుల్‌ గాంధీయే అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఏంచేయాలో తెలియని గందరగోళంలో ఆయన బందం సభ్యులు పడ్డారు. జయాపజయాలు సహజమని, అధ్యక్ష పదవిలో కొనసాగాలని దేశవ్యాప్తంగా విన్నపాలు వెల్లువెత్తినా రాహుల్‌ గాంధీ ససేమిరా అని అనడంతో సీనియర్‌ నేతల నిష్క్రమణల పర్వం జోరందుకుంది. రాహుల్‌గాంధీ బందంలోని సభ్యులందరూ ఆయన ఆలోచనలకు ప్రభావితమై కాంగ్రెస్‌ను ముందుకు తీసుకెళ్లే దక్పథం కలిగినవారే. ఇపుడు వారు ఒకరొకరుగా తప్పుకోవడంతో అయోమయ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీ చుక్కానిలేని నావలా మారిందన్న వ్యాఖ్యలు కూడా వ్యక్తమవుతున్నాయి. రాహుల్‌ గాంధీ స్థానే కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా ఆయన బందంలోని యువ నేతల పరిస్థితి ఏమిటన్నది అగమ్యగోచరంగా మారింది.

పరిస్థితి ఇంతగా ముదురుపాకాన పడుతున్నా రాహుల్‌ గాంధీ వౌనం వహించడానికి కారణం మళ్లీ పాత తరం నేతలు తెరపైకి వచ్చే అవకాశం కనిపించడం, రాహుల్‌ రాజీనామా నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సీనియర్‌ నేతలైన గులాం నబీ ఆజాద్‌, మోతీలాల్‌ వోరా, ఆనంద్‌ శర్మ, భూపేంద్ర హుడాలు విస్తృత స్థాయిలో మంతనాలు సాగించారు. అయితే, ఈ ప్రాథమిక చర్చల్లో రాహుల్‌ గాంధీకి సన్నిహితులైన యువ నేతలకు ఎలాంటి ప్రమేయం లేకపోడం గమనార్హం. కొత్తగా కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలో తాను జోక్యం చేసుకునేది లేదని రాహుల్‌తోపాటు యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో తదుపరి నిర్ణయం పూర్తిగా పార్టీ సీనియర్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో 'టీమ్‌ రాహుల్‌' గందరగోళంలో పడింది. అధ్యక్ష ఎన్నిక అంశంపై కీలక నిర్ణయం  తీసుకునే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలో కూడా ఉన్నది సీనియర్లే. ఇప్పటివరకు రాహుల్‌ వారసుడు ఎవరన్నదానిపై ఎలాంటి స్పష్టత లేదు. రాహుల్‌ గాంధీ వారసుడిగా యువ నేతే వస్తాడన్న సంకేతాలు కొందరు అందించినప్పటికీ అందుకు పార్టీ పాత కాపులు ఎంతమేరకు అవకాశం ఇస్తారన్నది సందేహంగానే కనిపిస్తోంది. రాహుల్‌ గాంధీ రాజీనామాను కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ఆమోదిస్తే ఎవరు ఉన్నారు..ఎవరు లేరు..అన్నదానితో నిమిత్తం లేకుండా మొత్తం ఏఐసీసీని పునఃప్రక్షాళన చేయాల్సి ఉంటుందని మరో సీనియర్‌ నేత వ్యాఖ్యానించడం గమనార్హం.