కమలా హరీస్ కట్టిన ట్యాక్స్ ఎంతో తెలుసా ?

కమలా హరీస్ కట్టిన ట్యాక్స్ ఎంతో తెలుసా ?

15-04-2019

కమలా హరీస్ కట్టిన ట్యాక్స్ ఎంతో తెలుసా ?

రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న ప్రవాస భారతీయురాలు కమలా హారీస్‌ గత పదిహేనేళ్లుగా తాను కట్టిన ట్యాక్స్‌ వివరాలను ప్రకటించారు. తనతోపాటు డెమొక్రాట్‌ పార్టీ తరపున పోటీలో ఉన్న సెనేటర్లు కొందరు తాము కట్టిన పన్నుల వివరాలు ఇప్పటికే వెల్లడించారు. ఇప్పుడు కమల కూడా వరుసలో చేరారు. 2004 నుంచి 2018 వరకు ప్రభుత్వానికి తాను కట్టిన పన్నుల వివరాలను కమల విడుదల చేశారు. 2014లో డగ్లస్‌ ఎమ్‌హాఫ్‌ను వివాహమాడినప్పటి నుంచి దంపతులిద్దరూ కలిసి జాయింట్‌ ట్యాక్స్‌లు చెల్లించారు. ఆ వివరాల ప్రకారం గత ఐదేళ్ల కాలంలో కమల దంపతులు సగటు పన్నులు 32.6 శాతం ఉన్నాయని తేలింది. ఒక్క 2018లోనే వీరిద్దరి ఆదాయం 1.89 మిలయన్‌ డాలర్లు (సుమారు రూ.13 కోట్లు) కాగా, దానిలో 6 లక్షల 97వేల డాలర్లు (దాదాపు రూ.5 కోట్లు) పన్నులు కట్టినట్లు కమల వెల్లడించారు.

అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తులు తాము కట్టిన పన్నుల వివరాలను విడుదల చేయాలని 2017లో ఓ ప్రతిపాదన వచ్చింది. అయితే దానికి రిపబ్లికన్‌ పార్టీ అడ్డుపడింది. ఇటువంటి ప్రతిపాదనలకు కమల ఎప్పుడూ మద్దతు తెలుపుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారిలో కేవలం డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం తన పన్నుల వివరాలను బయటపెట్టలేదు. గత అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్ర, ట్రంప్‌ వ్యాపారాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులకు కూడా ట్రంప్‌ తన ట్యాక్స్‌ వివరాలను వెల్లడించలేదు.