U-Visa Scam: యూ-వీసా కోసం దోపిడీల డ్రామా.. 11 మంది భారతీయుల అరెస్ట్
అగ్రరాజ్యం అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలనే కోరికతో కొందరు అక్రమ వలసదారులు వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. అత్యంత సులభంగా ‘యూ-వీసా’ (U-Visa Scam) పొందడమే లక్ష్యంగా కట్టుకథలతో నకిలీ దోపిడీలకు (Staged Robberies) పాల్పడిన 11 మంది భారతీయులను అమెరికన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో అత్యధిక శాతం మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఒక మహిళను అధికారులు భారత్‌కు డిపోర్ట్ చేశారు. వీరంతా అమెరికాలోని మసాచుసెట్స్, కెంటకీ, ఓహాయో తదితర రాష్ట్రాల్లో ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అక్రమంగా నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది.
మాస్టర్ మైండ్ రాంభాయ్ పటేల్..
ఈ బూటకపు స్కామ్‌కు (U-Visa Scam) రాంభాయ్ పటేల్ అనే వ్యక్తి మాస్టర్ మైండ్‌గా వ్యవహరించాడు. 2023 మార్చి నుంచి వీరు ఒక పక్కా ప్రణాళికతో ఈ నాటకాలకు తెరతీశారు. ఆయా రాష్ట్రాల్లోని కన్వీనియన్స్ స్టోర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, లిక్కర్ షాపులను వీరు తమ డ్రామాకు అడ్డాలుగా మార్చుకున్నారు. ఈ నాటకం ఆడటానికి ముందుగా ఆయా దుకాణాల యజమానులకు రాంభాయ్ భారీగా డబ్బులు చెల్లించి ముందస్తు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ప్లాన్ ప్రకారం.. ఒక వ్యక్తి తుపాకీ లాంటి ఆయుధంతో దుకాణంలోకి ప్రవేశించి బెదిరిస్తుండగా, అక్కడ క్లర్క్‌లుగా పనిచేస్తున్న ఈ నిందితులు ప్రాణభయంతో వణికిపోతున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యేలా అద్భుతంగా నటించారు. ఆ తర్వాత ఆ నకిలీ దొంగలు క్యాష్ తీసుకుని (U-Visa Scam) సులభంగా పారిపోయేలా ఉద్దేశపూర్వకంగానే పోలీసులకు ఆలస్యంగా సమాచారం ఇచ్చేవారు. ఈ తతంగం అంతా పూర్తయ్యాక, తాము అత్యంత భయంకరమైన సాయుధ దోపిడీకి గురయ్యామని, పోలీసుల దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామని నమ్మబలుకుతూ.. ‘యూ-వీసా’ కోసం వీరంతా దరఖాస్తు చేసుకుంటారు.
అసలేంటి ఈ యూ-వీసా (U-Visa)?
అమెరికాలో ఏదైనా హింసాత్మక నేరానికి లేదా దాడికి గురైన బాధితులకు, ఆ కష్టకాలంలో వారు దర్యాప్తు సంస్థలకు సహకరిస్తే.. మానవతా దృక్పథంతో అమెరికా ప్రభుత్వం జారీ చేసే ప్రత్యేక వీసానే ‘యూ-వీసా’ (U-Visa Scam) అంటారు. ఈ వీసా లభిస్తే అమెరికాలో నాలుగేళ్ల పాటు చట్టబద్ధంగా నివసించవచ్చు. అక్కడ ఉద్యోగం చేసుకునేందుకు వర్క్ పర్మిట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా మూడేళ్ల తర్వాత గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాస హోదా) కోసం దరఖాస్తు చేసుకునే సువర్ణావకాశం ఉంటుంది. నిజమైన బాధితుల కోసం ఉద్దేశించిన ఈ వీసాను తప్పుదారి పట్టించి లబ్ధి పొందాలనే ఆశతోనే నిందితులు ఈ భారీ కుట్ర పన్నారు.
అయితే, వీసా దరఖాస్తుల (U-Visa Scam) పరిశీలనలో అధికారులకు అనుమానం వచ్చి లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు బాగోతం బట్టబయలైంది. ఈ ఫ్రాడ్ కేసులో నేరం రుజువైతే నిందితులకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్ల పైనే) భారీ జరిమానా విధించే అవకాశం ఉందని అమెరికా న్యాయశాఖ స్పష్టం చేసింది.








