UBS: ఓటీటీలో కూడా ఉస్తాద్ ఫెయిలేనా?
టాలీవుడ్లో భారీ అంచనాల మధ్య రిలీజైన ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) ఈ ఏడాది అతిపెద్ద ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కెరీర్లోనే ఇది అతిపెద్ద ఫ్లాప్‌గా మారగా, రిలీజ్ టైమ్ లోనే సినిమాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి నిరాశాజనక స్పందన రావడంతో నిర్మాతలు ఆర్థికంగా గణనీయ నష్టాలను ఎదుర్కొన్నారు. డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Sankar) కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో నిలబడలేదని ఇటీవల ఒప్పుకోవడం గమనార్హం.
సాధారణంగా ఒక పెద్ద సినిమా ఫ్లాప్ అయిన తర్వాత, ముఖ్యంగా ఓటీటీకి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు, ట్రోల్స్ వెల్లువెత్తడం సహజం. ఇటీవల ది రాజా సాబ్(the raja saab) ఓటీటీలో రిలీజైన తర్వాత డైరెక్టర్ మారుతి(maruthi) మరియు హీరో ప్రభాస్(prabhas) పై వారాల తరబడి ట్రోలింగ్ జరిగిన ఉదాహరణ తాజాగా ఉంది. అయితే అదే పరిస్థితి ఉస్తాద్ భగత్‌సింగ్ విషయంలో కనిపించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా రీసెంట్ గా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైనప్పటికీ, సోషల్ మీడియాలో పెద్దగా స్పందన కనిపించడం లేదు.
ఇప్పటికే రిలీజ్ టైమ్ లోనే విపరీతమైన నెగెటివ్ టాక్, ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ సినిమాకు, ఓటీటీ రిలీజ్ తర్వాత పూర్తిగా సైలెన్స్ నెలకొనడం ట్రేడ్ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. సాధారణంగా ఫ్లాప్ సినిమాలకు ఓటీటీ విడుదల కొత్త చర్చలకు కారణమవుతుంటే, ఈ సినిమాకు మాత్రం అలాంటి హడావుడి కనిపించకపోవడం విశేషం. హీరోయిన్ శ్రీలీల(Sree Leela) యాక్టింగ్‌తో పాటు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) చేసిన పెట్టుబడులు కూడా పెద్దగా ఫలితం ఇవ్వలేకపోయాయి. మొత్తానికి, ఉస్తాద్ భగత్‌సింగ్ థియేటర్లోనే కాదు, ఓటీటీ వేదికపైనా స్పందన రాబట్టడంలో విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.








