వెండితెరపై అజరామరమైన శ్రీరామ కథ!
భారతీయ సంస్కృతిలో రామాయణానికి ఉన్న స్థానం అపారమైనది. శ్రీరాముడి ఆదర్శ జీవితం, సీతాదేవి సహనం, లక్ష్మణుడి సోదర ప్రేమ, హనుమంతుడి భక్తి, రావణుడి అహంకారం.. ఇలా ప్రతి పాత్రా తరతరాలుగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అందుకే రామాయణం కేవలం ఒక ఇతిహాసంగా మాత్రమే కాకుండా, భారతీయ కళలలో, సాహిత్యం, రంగస్థలం, సంగీతం, సినిమాలకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తోంది. ముఖ్యంగా భారతీయ చలనచిత్ర రంగంలో రామాయణ కథకు విశేషమైన ఆదరణ లభించింది. సాంకేతిక సదుపాయాలు అంతగా లేని మూకీ సినిమా రోజుల నుంచి నేటి అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ చిత్రాల వరకు, శ్రీరామ కథను తెరపై ఆవిష్కరించేందుకు పలువురు దర్శక నిర్మాతలు కృషి చేశారు. ఒకప్పుడు తెరపై కదిలే బొమ్మలు(తోలు బొమ్మలాట)గా కనిపించిన పౌరాణిక ఘట్టాలు.. ఆ తర్వాత సంగీతం, సంభాషణలు, రంగులు, భారీ సెట్లు, అద్భుతమైన గ్రాఫిక్స్‌తో, వర్తమానంలో సృజనత్మతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే స్థాయికి చేరుకున్నాయి. 1917లో దాదాసాహెబ్ ఫాల్కే రూపొందించిన లంకా దాహాన్తో మొదలైన ఈ రామాయణ వెండితెర ప్రయాణం, ప్రస్తుతం రణబీర్ కపూర్ కథానాయకుడిగా, నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణం వరకు కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తెలుగు, హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ అనేక చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో కొన్ని భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయాలుగా నిలిచిపోయాయి.
మూకీ సినిమా యుగంలోనే రామాయణ కథతో వచ్చిన లంకా దహనం (1917)
1917లో విడుదలైన భారతీయ మూకీ చిత్రంగా, మన భారతీయ సినిమా తెరపై హిందూ పౌరాణికగాధలలోని రామాయణంలో ఒక ఘట్టం ఆధారంగా ‘లంకా దహనం’ అనే చిత్రానికి దాదాసాహెబ్ ఫాల్కే దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రమే మనకు తొలి రామాయణం ఫీచర్ చిత్రంగా చెప్పుకోవాలి. వాల్మీకి రచించిన రామాయణం ఈ కథకు మూలం ఇది. 1913లో విడుదలైన రాజా హరిశ్చంద్ర తర్వాత ఫాల్కే దర్శకత్వం వహించిన రెండో పూర్తి నిడివి చిత్రం ఇదే. భారతదేశంలో తొలి పూర్తి నిడివి ఫీచర్ చిత్రంగా రాజా హరిశ్చంద్ర గుర్తింపు పొందింది. భారతీయ సినిమాకు తొలి ద్విపాత్రాభినయం రాజా హరిశ్చంద్ర చిత్రంలో తారామతి పాత్రను పోషించిన అన్నా సాలుంకే, లంకా దహనంలో రెండు విభిన్న పాత్రల్లో నటించారు. ఆ కాలంలో వాణిజ్య రంగస్థల ప్రదర్శనలు, నటనలో మహిళలు పాల్గొనడంపై సామాజిక ఆంక్షలు ఉండటంతో స్త్రీ పాత్రలను సైతం పురుషులే పోషించేవారు. ఈ నేపథ్యంలో అన్నా సాలుంకే ఈ చిత్రంలో శ్రీరాముడిగా, ఆయన భార్య సీతాదేవిగా కూడా ద్విపాత్రాభినయం చేశారు. తద్వారా భారతీయ సినిమా చరిత్రలో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. రామాయణంలోని హనుమంతుడు లంకకు వెళ్లడం, రావణుడి సైనికులకు చిక్కడం, తన తోకకు నిప్పు పెట్టిన తర్వాత లంకానగరాన్ని దహనం చేయడం వంటి ఘట్టాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆ రోజుల్లో సినిమా అంటే నేటి తరహాలో మాటలు, పాటలు, నేపథ్య సంగీతంతో కూడిన అనుభవం కాదు. తెరపై కదిలే దృశ్యాలు, కథను వివరించే వాక్యాలు, నటుల హావభావాలే ప్రధాన ఆధారాలు. అయినప్పటికీ, పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతో ఫాల్కే రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హనుమంతుడు లంకను దహనం చేసే సన్నివేశాలను చూపించేందుకు ఆయన ఉపయోగించిన అప్పటి ప్రత్యేక చిత్రీకరణ పద్ధతులు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.
‘లవకుశ’ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర.. ఎన్టీఆర్ రాముడి రూపం
తెలుగు సినిమా చరిత్రలో పౌరాణిక చిత్రాలకు ఉన్న ఆదరణ ప్రత్యేకమైనది. ముఖ్యంగా శ్రీరాముడి పాత్రను వెండితెరపై ఆవిష్కరించిన నటుల్లో నందమూరి తారక రామారావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ధరించిన పౌరాణిక పాత్రలు, వాటిలోని గాంభీర్యం, సంభాషణలు చెప్పే తీరు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1934లో విడుదలైన తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాదతో తెలుగు సినిమా శబ్దయుగంలోకి ప్రవేశించిన తర్వాత, పౌరాణిక చిత్రాల నిర్మాణం మరింత ఊపందుకుంది. రామాయణంలోని ఉత్తరకాండ ఘట్టాల ఆధారంగా రూపొందిన లవకుశ చిత్రాలు ఈ ప్రస్థానంలో విశేష స్థానం సంపాదించాయి. 1934లో సి. పుల్లయ్య దర్శకత్వంలో ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ నిర్మాణం లో మూకీ చిత్రంగా కాకుండా శబ్దచిత్రంగా లవకుశ రూపొందింది. అనంతరం 1963లో సి. పుల్లయ్య, ఆయన కుమారుడు సి.ఎస్. రావు దర్శకత్వంలో ఎన్టీఆర్, అంజలీదేవి ప్రధాన పాత్రల్లో మరో లవకుశ తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో అపారమైన ఆదరణ పొందింది. తెలుగులో తొలి పూర్తి నిడివి రంగుల చిత్రంగా కూడా ఇది గుర్తింపు పొందింది.
హనుమంతుడి భక్తి నుంచి రావణుడి విశిష్టత కోణం వరకు
సీతారామ కళ్యాణం చిత్రం, సంక్రాంతి కానుకగా 1961 జనవరి 6న విడుదలైన పౌరాణిక చిత్రం. ఎన్.ఎ.టీ. పిక్చర్స్ పతాకంపై నిర్మాత ఎన్. త్రివిక్రమ రావు నిర్మించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, బి. సరోజాదేవి, హరనాథ్, గీతాంజలి, ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం గాలి పెంచల నరసింహారావు అందించారు. ఎన్.టీ.ఆర్. దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. భూకైలాస్ తరువాత రామారావు ఈ చిత్రంలో రావణ పాత్ర ధరించారు. ఈ సినిమాలో రామారావు పోషించిన రావణ పాత్ర మిక్కిలి ప్రాచుర్యం పొందింది. రావణ తన అభిమాన పాత్రగా ఆ రోజుల్లో ఎన్.టి.ఆర్ చెప్పుకున్నారు. హరినాథ్ గీతాంజలి శ్రీరామ, సీత పాత్రలు ధరించారు. నారద పాత్ర కాంతారావు ధరించారు. ప్రాచుర్యంలో ఉన్న కథలకు భిన్నంగా రావణుడు, శూర్పణఖలు, సీత, రాముల్ని… సీతా స్వయంవరం కన్నా ముందే మోహించడం ఇందులో చూపబడింది. ఇందుకు రామారావు గారు ఆశ్చ్యర్య రామాయణం, విచిత్ర రామాయణం వంటి గ్రంథాలను పరిశీలించారని అంటారు. చిత్రానికి తొలుత ఎస్.రాజేశ్వరరావు పనిచేశారు. రుద్రవీణతో శివుని ప్రసన్నం చేసుకునే సందర్భంలో వచ్చే పాట ‘కానరార కైలాస నివాస’, ‘జటాకటాహ’ మొదలైనవి రాజేశ్వరరావు గారు స్వరపరచారు.
రామాయణంలోని శ్రీరాముడి పాత్రతో పాటు హనుమంతుడి భక్తి, పరాక్రమం కూడా చిత్ర నిర్మాతలకు ప్రేరణగా నిలిచాయి. 1976లో విడుదలైన హిందీ చిత్రం బజరంగ్బలిలో దారా సింగ్ హనుమంతుడి పాత్ర పోషించారు. అనంతరం టెలివిజన్‌లోనూ ఇదే పాత్రతో ఆయన విశేష గుర్తింపు పొందారు. 1975లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామాంజనేయ యుద్ధం తెలుగు పౌరాణిక చిత్రాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎన్టీఆర్ శ్రీరాముడిగా నటించిన ఈ చిత్రంలో భగవంతుడిపై భక్తుడికి ఉండే అచంచలమైన విశ్వాసాన్ని ప్రధానంగా చూపించారు. భక్తి, విధేయత, ధర్మం వంటి అంశాలను నాటకీయంగా ఆవిష్కరించడం ఈ చిత్ర విశిష్టత. 1978లో ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన శ్రీరామ పట్టాభిషేకం మరో ముఖ్యమైన చిత్రం. ఇందులో ఆయన శ్రీరాముడిగా, రావణుడిగా రెండు పాత్రలు పోషించారు. ఒకే నటుడు రెండు విభిన్న వ్యక్తిత్వాలను తెరపై ఆవిష్కరించడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
హిందీ సినిమాల్లో రామాయణానికి ప్రత్యేక స్థానం
తెలుగు చిత్రసీమలో మాదిరిగానే హిందీ సినిమాల్లోనూ రామాయణానికి ప్రత్యేక స్థానం ఉంది. 1943లో విజయ్ భట్ దర్శకత్వంలో విడుదలైన ‘రామ్ రాజ్య’ ఈ పరంపరలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన చిత్రం. ప్రేమ్ ఆదిబ్ శ్రీరాముడిగా, శోభనా సమర్థ్ సీతాదేవిగా నటించిన ఈ చిత్రం అప్పటి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ధర్మబద్ధమైన పాలన, ప్రజల సంక్షేమం, న్యాయం, సత్యం వంటి భావాలను ప్రతిబింబించే ‘రామరాజ్యం’ అనే ఆదర్శాన్ని ఈ చిత్రం తెరపై ఆవిష్కరించింది. మన జాతిపిత మహాత్మా గాంధీ చూసిన అరుదైన చిత్రాల్లో ఇది ఒకటిగా కూడా ప్రసిద్ధి చెందింది. 1961లో బాబూభాయ్ మిస్త్రీ దర్శకత్వంలో వచ్చిన సంపూర్ణ రామాయణ్ మరో ముఖ్యమైన చిత్రం. మహిపాల్ శ్రీరాముడిగా, అనితా గుహ సీతాదేవిగా నటించారు. శ్రీరాముడి జననం నుంచి సీతా స్వయంవరం, వనవాసం, సీతాపహరణం, హనుమంతుడి లంకా ప్రయాణం, రావణ సంహారం వరకు రామాయణంలోని ప్రధాన ఘట్టాలను ఈ చిత్రం తెరపైకి తీసుకొచ్చింది. అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యుద్ధ సన్నివేశాలు, ప్రత్యేక దృశ్య ప్రభావాలు, భక్తిరస ప్రధానమైన పాటలు దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తరువాతి కాలంలో లవ్ కుశ్ వంటి చిత్రాలు రామాయణంలోని ఉత్తరకాండ ఘట్టాలను ప్రజలకు చేరువ చేశాయి. ముఖ్యంగా సీతాదేవి అరణ్యవాసం, లవకుశుల కథ, తండ్రి-కుమారుల అనుబంధం వంటి అంశాలు ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రేకెత్తించాయి.
బాపు కళాత్మక దృష్టి.. ‘రామాయణం’ ప్రత్యేకత
బాపు దర్శకత్వం వహించిన ‘సంపూర్ణ రామాయణం’ తెలుగు చలన భక్తి చిత్రం 1972 మార్చి 16న విడుదల అయ్యింది. రామాయణ కావ్యాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు బాపు సిద్ధహస్తుడు. వారి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శోభన్‌బాబు, చంద్రకళ, ఎస్వి రంగారావు, చంద్రమోహన్, ప్రధాన పాత్రలు పోషించారు. సీతా రాముల జననం నుండి రావణ సంహారం, శ్రీరామ పట్టాభిషేకంవరకు రామాయణం లోని ప్రధాన ఘట్టాలను ఈ చిత్రం తెరపైకి తీసుకొచ్చింది. రామాయణ కథతో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాపు దర్శకత్వం వహించిన మరో చిత్రం సీతా కల్యాణం (1976) మరో విశిష్టమైన పౌరాణిక చిత్రం. సీతారాముల వివాహ ఘట్టానికి ప్రాధాన్యమిస్తూ, రామాయణంలోని దృశ్యాలను తనదైన చిత్రకళా శైలిలో ఆవిష్కరించడం బాపు ప్రత్యేకత. రామాయణం అంటే కేవలం యుద్ధం, రావణ సంహారం మాత్రమే కాదని, అందులోని ప్రేమ, అనుబంధం, ధర్మం, విధేయత వంటి విలువలకూ సమాన ప్రాధాన్యం ఉందని ఈ తరహా చిత్రాలు చాటిచెప్పాయి. నందమూరి బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతాదేవిగా, అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకిగా, బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం 2011 నవంబరు 17న విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం. తెలుగు సినిమా చరిత్రలో లవకుశల చరిత్ర మూడవసారిగా ఈ చిత్రాన్ని రూపొందించారు..
టెలివిజన్‌లోనూ రామాయణ ప్రభంజనం
రామాయణ కథకు వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా అపూర్వమైన ఆదరణ లభించింది. 1987లో రామానంద్ సాగర్ రూపొందించిన హిందీ టెలివిజన్ ధారావాహిక రామాయణ్ దేశవ్యాప్తంగా, ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అరుణ్ గోవిల్ శ్రీరాముడిగా, దీపికా చిఖలియా సీతాదేవిగా, దారా సింగ్ హనుమంతుడిగా నటించారు. ఆదివారం ఉదయం ఈ ధారావాహిక ప్రసారమయ్యే సమయంలో వీధులు నిర్మానుష్యంగా మారేవని, కుటుంబ సభ్యులంతా టెలివిజన్ ముందు కూర్చునేవారని అప్పటి ప్రేక్షకులు గుర్తుచేసుకుంటారు. పాత్రధారులను భక్తితో చూసే స్థాయిలో ఈ ధారావాహిక ప్రజలపై ప్రభావం చూపింది. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో పునఃప్రసారం కావడంతో మరోసారి విశేష ప్రేక్షకాదరణ పొందింది. టెలివిజన్‌లో వచ్చిన ఈ విజయంతో రామాయణ కథ సినిమాలకే పరిమితం కాదని, ఇంటింటికీ చేరగల శక్తి దానికి ఉందని స్పష్టమైంది. ఆ తర్వాత కూడా పలు భాషల్లో రామాయణ ఆధారిత ధారావాహికలు రూపొందాయి.
‘బాల రామాయణం’.. బాలనటులతో పౌరాణిక అద్భుతం
1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం తెలుగు చిత్రసీమలో ప్రత్యేక ప్రయోగంగా నిలిచింది. చిన్నారులతో, వారి ఎత్తుకు సరిపడా సెట్టింగ్స్ వేసి, రామాయణంలోని ప్రధాన పాత్రలను పోషింపజేసి, మొత్తం కథను బాలల కోణంలో ప్రేక్షకులకు అందించడం ఈ చిత్రం ప్రత్యేకత. జూనియర్ ఎన్టీఆర్ శ్రీరాముడిగా నటించగా, స్మితా మాధవ్ సీతాదేవి పాత్ర పోషించారు. పిల్లలే ప్రధాన పాత్రల్లో ఉన్నప్పటికీ, రామాయణంలోని కీలక ఘట్టాలను భారీ స్థాయిలో చిత్రీకరించడం, పౌరాణిక వాతావరణాన్ని సృష్టించడం, కథలోని నీతి, ధర్మం, ధైర్యం వంటి అంశాలను సరళంగా చూపించడం ఈ చిత్రానికి గుర్తింపు తెచ్చాయి. చిన్నారులకు రామాయణ కథను పరిచయం చేయడంలోనూ ఈ చిత్రం పాత్ర పోషించింది.
జపాన్-భారత్ సంయుక్త యానిమేషన్ ప్రయోగం.. ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’
1992లో రూపొందిన రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ భారతీయ, జపాన్ సినీ కళాకారుల సహకారంతో రూపుదిద్దుకున్న యానిమేషన్ చిత్రం. యుగో సాకో దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, సంప్రదాయ రామాయణ కథను జపనీస్ యానిమేషన్ సాంకేతికతతో మేళవించింది. సజీవ నటీనటులతో కాకుండా చిత్రాల కదలికల ద్వారా రామాయణాన్ని ఆవిష్కరించడం ఈ చిత్ర ప్రత్యేకత. శ్రీరాముడి వనవాసం, సీతాపహరణం, హనుమంతుడి సాహసం, రావణుడితో యుద్ధం వంటి ఘట్టాలను యానిమేషన్ రూపంలో చూపించారు. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసిన ముఖ్యమైన ప్రయత్నాల్లో ఇది ఒకటి.
ఆధునిక కాలంలో కొత్త కథనాలు.. ‘రావణ’ నుంచి ‘ఆదిపురుష’ వరకు
కాలం మారుతున్న కొద్దీ రామాయణాన్ని తెరపై చూపించే విధానంలోనూ మార్పులు వచ్చాయి. 2010లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రావణ్ హిందీ చిత్రం, రామాయణంలోని పాత్రలను ఆధునిక నేపథ్యంలో పునర్వ్యాఖ్యానించే ప్రయత్నం చేసింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విక్రమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కథను రావణుడి పాత్రకు దగ్గరగా ఉండే దృష్టికోణంలోనూ పరిశీలించారు.
2023లో ఓం రౌత్ దర్శకత్వంలో విడుదలైన ఆదిపురుష్ మరో భారీ ప్రయోగం. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. ఆధునిక విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, భారీ యుద్ధ సన్నివేశాల ద్వారా రామాయణాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలనేది చిత్ర బృందం లక్ష్యం. ఈ పరిణామం రామాయణం వంటి సాంస్కృతిక ప్రాధాన్యమున్న ఇతిహాసాలను ఆధునికంగా తెరకెక్కించేటప్పుడు సృజనాత్మకతతో పాటు సంప్రదాయాల పట్ల సున్నితత్వం ఎంత ముఖ్యమో మరోసారి చర్చకు తెచ్చింది.
రణబీర్ కపూర్ ‘రామాయణం’
ప్రపంచ ప్రేక్షకుల కోసం మరో మహా ప్రయత్నం
శతాబ్దానికి పైగా సాగుతున్న రామాయణ చిత్రాల ప్రస్థానంలో ఇప్పుడు మరో భారీ చిత్రం చేరబోతోంది. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా నటిస్తున్న రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్, ఈ చిత్రంలో రవీ దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్‌తో పాటు అంతర్జాతీయ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. అత్యాధునిక దృశ్య ప్రభావాలు, భారీ నిర్మాణ విలువలు, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణుల భాగస్వామ్యంతో రామాయణాన్ని ప్రపంచ ప్రేక్షకులకు మరింత విస్తృతంగా పరిచయం చేయాలన్నది చిత్ర బృందం లక్ష్యం.. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్.. 8 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న డిఎన్ ఇజి, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తోంది. ‘రామాయణం’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇండియా మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. హిందీ మార్కెట్లో ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా IవీAXలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘రామాయణ’ పార్ట్ 1 దీపావళి కానుకగా నవంబర్ 5 న విడుదల చేస్తుండగా, పార్ట్ 2 దీపావళి 2027లో విడుదల కానుంది. భారత్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ప్రీమియర్
2026 అక్టోబర్ 27 సాయంత్రం లాస్ ఏంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్లో ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ జరిగింది. ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించిన ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అకాడమీ మ్యూజియం చలనచిత్ర చరిత్ర, కళ, సాంకేతికతకు అంకితమైన ప్రముఖ సంస్థ. గతంలో ఎన్నో అంతర్జాతీయ కార్యక్రమాలకు, ఆస్కార్‌కు సంబంధించిన వేడుకలకు ఈ మ్యూజియం వేదికగా నిలిచింది. ఇప్పుడు ‘రామాయణ’ ప్రీమియర్ అక్కడ జరగటం ఈ చిత్ర బృందానికి ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేసే దిశగా ఇది కీలక ముందడుగు.
ఈ ప్రీమియర్‌లో భాగంగా సినిమాను 3డీలో ప్రదర్శించనున్నారు. మొత్తం 945 మంది ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉన్న థియేటర్లో పూర్తి స్థాయి ప్రేక్షకుల సమక్షంలో స్క్రీనింగ్ జరగనుంది. దీపావళి పండుగ సమయంలో ప్రీమియర్ జరుగుతుండటంతో భారతీయ పండుగ వాతావరణాన్ని లాస్ ఏంజెల్స్‌కు తీసుకెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. రెడ్ కార్పెట్ కార్యక్రమానికి సంప్రదాయ భారతీయ పండుగ దుస్తులు ధరించి రావాలని ముందుగా హాజరయ్యే అతిథులను కోరారు.
తరాలు మారినా తరగని రామాయణ వైభవం
ఒక శతాబ్దానికి పైగా సాగుతున్న రామాయణ చిత్రాల ప్రస్థానం భారతీయ సినిమా పరిణామానికి అద్దం పడుతుంది. మూకీ చిత్రాల నుంచి రంగుల సినిమాల వరకు, సంప్రదాయ పౌరాణిక చిత్రాల నుంచి ఆధునిక సాంకేతిక అద్భుతాల వరకు ఎన్నో మార్పులు వచ్చినా, శ్రీరామ కథపై ప్రేక్షకుల ఆసక్తి మాత్రం కొనసాగుతూనే ఉంది.
లంకా దహనంలో హనుమంతుడి తోకకు నిప్పు అంటుకున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన తొలి తరం ప్రేక్షకుల నుంచి, రణబీర్ కపూర్ రాముడి రూపాన్ని అత్యాధునిక తెరపై చూడాలని ఎదురుచూస్తున్న నేటి తరం వరకు ఈ ప్రయాణం సాగుతోంది.రామాయణం ఒక కాలానికి, ఒక భాషకు, ఒక తరానికి పరిమితమైన కథ కాదు. అది తరతరాలుగా పునరావిష్కరణ చెందుతున్న భారతీయ సాంస్కృతిక వారసత్వం. అందుకే దర్శకులు మారినా, నటులు మారినా, సాంకేతికత మారినా.. వెండితెరపై శ్రీరామ కథకు ఆదరణ కొనసాగుతూనే ఉంటుంది. శతాబ్దం క్రితం మూకీ తెరపై మొదలైన ఈ ప్రయాణం.. నేటి ప్రపంచస్థాయి సినిమాల వరకు సాగుతుండటం భారతీయ ఇతిహాసాల అజరామరమైన శక్తికి నిదర్శనం.
మన జీవన విధానాన్ని చెప్పే ఒక నియమావళి రామాయణం: నితేష్ తివారీ
డైరెక్టర్ నితేష్ తివారీ మాట్లాడుతూ.. “నేను హిందీలో ‘శివ’ సినిమా చూశాను. అప్పటికి నాకు ఆ సినిమా గురించి ఏమీ తెలియదు. ఆ సినిమా చూసి నాగార్జున గారిని, అమల గారిని, వాళ్ల ప్రెజెంటేషన్‌ను చూసి ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అసలు రాంగోపాల్ వర్మ ఎవరు అని తెలుసుకున్నాను. అలాగే ‘ప్రతిబంధ’ సినిమా కూడా నన్ను ఆశ్చర్యపరిచింది. నేను దాదాపుగా అన్ని తెలుగు సినిమాలు చూస్తాను. ‘గీతాంజలి’, ‘క్షణక్షణం’ సినిమాలన్నీ తెలుగులోనే చూశాను. అందులోని పాటలు కూడా నాకు తెలుసు. ఆ తర్వాత ‘ఈగ’, ‘మగధీర’, ‘బాహుబలి’ ఇలా అన్ని సినిమాలను హిందీలో చూశాను. నాకు రాజమౌళి గారు, సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్.. ఇలా అందరి సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు మా ‘రామాయణ’ సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. మీరు తెలుగులో చూసినా, హిందీలో చూసినా అదే ప్రేమను అందిస్తారని కోరుకుంటున్నాను. మనమందరం తరతరాలుగా ‘రామాయణం’ వింటూ పెరిగాం. ఇది కేవలం సినిమా కాదు.. ఇది మన జీవన విధానాన్ని చెప్పే ఒక నియమావళి రామాయణం అంటేనే ఒక యూనివర్స్. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈరోజు భారతీయ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఆ గుర్తింపును మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమాను తీర్చిదిద్దడం జరిగింది. గత వందేళ్లుగా మన రామాయణాన్ని ప్రపంచవ్యప్తంగా ఎందరో మహానుబావులు సినిమాగా తీసి మానవజాతికి అందించారు. మరో సారి మన కథను ప్రపంచానికి తీసుకెళ్తున్నాం. మీ అందరి ప్రేమ, అభిమానాలు మాకు కావాలి.” అన్నారు.
రణ్‌బీర్‌తో మేము డిస్ట్రిబ్యూట్ చేసిన ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల’ తరువాత రామాయణంతో హట్రిక్ కొట్టబోతున్నాం: దిల్ రాజు
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా. హాలీవుడ్లో సోనీ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది. నార్త్‌లో కరణ్ జోహార్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మా సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. రామాయణం తరతరాలుగా, యుగయుగాలుగా వస్తున్న చరిత్ర. ఇంత గొప్ప సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత నమిత్ గారికి ధన్యవాదాలు. థియేటర్లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. నితీష్ గారు ‘దంగల’ సినిమాతో ఇండియన్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. రణ్‌బీర్ గారితో ‘బ్రహ్మాస్త్ర’, ‘యానిమల’ సినిమాలను ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. రణ్‌బీర్ ఇందులో రాముడి పాత్రలో ఆయన లీనమైపోయి నటించారు. యశ్ గారు ఇండియన్ సినిమాలోనే ఒక చరిత్ర సృష్టించారు. ఇందులో అద్భుతమైన రావణబ్రహ్మ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో నటించిన సాయి పల్లవి మన తెలుగు అమ్మాయి. ఇప్పుడు ఆమె ‘రామాయణ’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందబోతోంది. అలాగే ఇందులో శూర్పణఖ పాత్రలో నటించిన రకుల్ గారు కూడా మన దగ్గర ఎన్నో సినిమాలు చేశారు. రామాయణం లేకుండా మన దేశ చరిత్ర లేదు. రాముడి కథను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్న యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అన్నారు.
సంగీతపరంగా శ్రీరాముడి ప్రార్థనలోని స్వచ్ఛత, ఆత్మీయతను, శాంతితత్వాన్ని ఎక్కడా మిస్ అవ్వలేదు: ఏఆర్ రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ: “‘జై జై రామ’ పాటకు హృదయం శ్రీరాముడి నామాన్ని శక్తివంతంగా పదే పదే స్మరించడమే. సంగీతపరంగా ఒక ప్రార్థనలోని స్వచ్ఛత, ఆత్మీయతను కాపాడుతూ.. అదే సమయంలో ఆ కంపోజిషన్ సినిమాటిక్ సాంగ్‌గా ఎదిగేలా చేయాలనుకున్నాం. రకేందు మౌళి రాసిన సాహిత్యానికి దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ తమదైన భావోద్వేగ వోకల్స్ అందించారు. అదే సమయంలో పాటలోని భక్తి భావానికి నిజాయితీగా నిలిచారు. ప్రేక్షకులకు ఈ పాట శాంతిని, అనుబంధాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను.” అన్నారు.
దిల్ రాజు భాగం కావడం చాలా ఆనందంగా ఉంది: నిర్మాత నమిత్ మల్హోత్రా
నిర్మాత నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. మా డైరెక్టర్ నితీష్ తివారీ లేకపోతే ఈ జర్నీ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమాలో దిల్ రాజు గారు భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంత అద్భుతమైన, హై క్వాలిటీ స్టోరీ టెల్లింగ్‌ను ప్రపంచానికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన సపోర్ట్‌ను మర్చిపోలేము. ఇండియా మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా.. హిందీ మార్కెట్లో ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా IMAXలోను, 3Dలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘రామాయణ’ పార్ట్ 1 దీపావళి కానుకగా నవంబర్ 5 న విడుదల చేస్తుండగా, పార్ట్ 2 దీపావళి 2027లో విడుదల కానుంది.
నా పూర్వ జన్మ సుకృతం: రణ్‌బీర్ కపూర్
శ్రీ రాముడు పాత్రధారి రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. ‘భారతీయ చరిత్రలో కొన్ని కథలు చెప్పాల్సిన అవసరం లేదు. తరతరలుగా అవి మనతో పాటు అణువణువునా జీర్నించి వుంటాయి. రామాయణం కూడా అలాంటిదే. రామాయణం ఒక అద్భుతమైన ప్రయాణం. గొప్ప తండ్రిగా ఎలా ఉండాలి, కొడుకుగా ఎలా ఉండాలి? భర్తగా ఎలా ఉండాలి? అన్నగా ఎలా వుండాలి? స్నేహితుడిగా ఎలా ఉండాలో మనందరికీ చెబుతుంది. కచ్చితంగా ఏదో ఒక అద్భుతమైన అనుభూతిని పొందినట్టుగా ఉంటుంది. మన పూర్వికులు మనందరిలో మంచిని పంచిన కథ ఇది. నమిత్ మల్హోత్రా అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాను నిర్మించారు. డైరెక్టర్ నితీష్ గారు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. రామాయణం లో రాముడిగా నటించడం నా పూర్వ జన్మ సుకృతం, నన్ను ఈ సినిమాలో భాగం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు.
సాయి పల్లవితో ఈ సినిమా జర్నీ ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ సెట్లో సాయి పల్లవిని చూసినప్పుడు నిజమైన సీతమ్మవారిని చూసినట్టుగా అనిపించింది. తన తప్పితే ఈ క్యారెక్టర్లో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. నాకు ఒక బ్రదర్ ఉంటే రవిలా వుండేవాడు. రాకింగ్ స్టార్ యశ్ మంచి ఫ్యామిలీ మెన్. ఆయన తన ఫ్యామిలీని, తన సిటీని అన్నింటినీ వదిలేసి ఈ ‘రామాయణ’ సినిమా కోసం వచ్చారు. ఆయనలాంటి హార్డ్ వర్కర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. దిల్ రాజు డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో వచ్చే సినిమాలకు ఆయన ఎంతగానో సపోర్ట్ చేస్తారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి మరిన్ని ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులకు, నా అన్నదమ్ములందరికీ నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానం నాకు చాలా విలువైనవి.’ అన్నారు.
ఉత్తమమైన ఆ ఇల్లాలి పాత్రకు న్యాయం చేసానని భావిస్తున్నాను: సాయి పల్లవి
సీతా దేవి పాత్రధారి సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘రామాయణ’ మూడేళ్ల జర్నీ అయినప్పటికీ, మా డైరెక్టర్, నిర్మాత పదేళ్ల క్రితం నుంచే ఈ ప్రయాణంలో ఉన్నారు. ఈ సినిమా మీకు ఒక తెలుగు సినిమాలాగే అనిపిస్తుంది. నితీష్ గారు ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా, క్లారిటీగా డిజైన్ చేశారు. అలాగే నమిత్ గారి విజన్ చాలా గొప్పది. ప్రతి క్యారెక్టర్‌ను పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరాలనే గొప్ప ఉద్దేశంతో రూపొందించారు. నేను కూడా రామాయణం చూసి పెరిగాను. ఈ సినిమాలో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కనెక్ట్ అవుతారు. దిల్ రాజు గారితో ‘ఫిదా’ సినిమా నుంచి జర్నీ ఉంది. ఆయన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. రణ్‌బీర్ కపూర్ లాంటి గొప్ప యాక్టర్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. ఆయనతో కలిసి పని చేయడం చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. అలాగే యశ్ గారి విజన్ కూడా ఎప్పుడూ పెద్దగా ఉంటుంది. సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉన్న యాక్టర్ ఆయన. సీతమ్మ పాత్రను చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఒక దైవత్వం కలగాలి. అదే నా కోరిక. ఎంతో ఉత్తమమైన ఆ ఇల్లాలి పాత్రకు న్యాయం చేసానని బావిస్తున్నాను.” అన్నారు.
ఎందుకు రామాయణం చిత్రాన్ని ఆదరించాలి?
తెలుగు టైమ్స్ ఎంతో అద్భుతంగా తయారుచేసిన ఈ కవర్ స్టోరీలో 1915లో వచ్చిన లంకాదహనం మూవీ నుంచి నేటి రామాయణం వరకు ఎంత బాగా శ్రీరామ కథలను చెప్పవచ్చో వివరించాం.
భారతదేశం హిందూ దేశం. మనందరి ఆరాధ్య దైవం శ్రీరాముడు. భారత ప్రభుత్వం కూడా శతాబ్దాలుగా ఉన్న అయోధ్య రామ మందిరం కేసును పరిష్కరించి, భారత ప్రజలందరికీ అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మించి, భారతీయులకు ముఖ్యంగా, హిందువులకు ఇది గుండె చప్పుడు అని చెప్పింది. ఈ పరిస్థితిలో అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తున్న రామాయణం అనేక దేశాలకు వెళ్తుందని మనకి తెలుసు. ఒక బాహుబలి, ఒక అంతర్జాతీయంగా భారతీయ సినిమా నిర్మాణ ఫటిమను తెలిపి చెప్పాయి. ఇప్పుడు వచ్చే రామాయణం భారతీయ సినిమా నిర్మాణ ప్రక్రియనే కాక భారతీయతనే ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇది ఒక నితీష్ తివారీ సినిమా కాదు. ఒక రణధీర్ కపూర్ సినిమా కాదు. ఇది భారతీయ సినిమా. ఇప్పటి వరకు బయటకు వచ్చిన స్టిల్స్ కానీ ప్రోమోలు కానీ ఈ సినిమా గొప్పతనాన్ని చూపిస్తున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారతదేశపు శ్రీరామకథను తెలిపే ముందు భారతీయులందరూ ఈ సినిమాని విజయవంతం చేయాలని తెలుగు టైమ్స్ భావిస్తోంది. హిందువుల ఉనికిని, భారతీయుల ఇష్టదైవాన్ని ప్రపంచానికి తెలిపే ఈ సినిమా విజయంలో మనందరం పాలుపంచుపోవాలని తెలుగు టైమ్స్ కోరుకుంటోంది.
– వేంకట సుబ్బారావు చెన్నూరి, ఎడిటర్, తెలుగు టైమ్స్.







