ధృవ్ విక్రమ్‌పై నిర్మాతల ఫిర్యాదు..
కోలీవుడ్ నటుడు ధృవ్ విక్రమ్(Dhruv Vikram) మరోసారి సినిమా కమిట్మెంట్లకు సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచారు. నీలాద్రి ప్రొడక్షన్స్(neeladri productions), పెన్ స్టూడియోస్(Pen studios) సంస్థలు కలిసి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌ను ఆశ్రయిస్తూ ధృవ్‌పై అధికారిక ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డైరెక్టర్ రమేష్ వర్మ(Ramesh varma) తెరకెక్కించాల్సిన సినిమాకు ధృవ్ ముందుగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, అడ్వాన్స్‌గా రూ.1 కోటి చెల్లించడమే కాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పై కూడా భారీగా ఖర్చు చేసినట్లు నిర్మాతలు పేర్కొంటున్నారు. మ్యూజిక్ సిట్టింగ్స్, సెట్ల ఏర్పాట్లు, నటీనటులు, టెక్నీషియన్లకు అడ్వాన్స్‌లు చెల్లించిన తర్వాత సినిమా ప్రారంభ దశలోనే ఈ సమస్య తలెత్తిందని వారు వాదిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ధృవ్ తాజాగా మైత్రి మూవీ మేకర్స్(Mythri movie makers) నిర్మాణంలో డైరెక్టర్ కరణ్(Karan)తో కొత్త సినిమాను అనౌన్స్ చేయడం వివాదానికి కారణమైంది. తమ బ్యానర్లో రూపొందాల్సిన సినిమానే ధృవ్ నాలుగో సినిమాగా ఉండాల్సి ఉండగా, కొత్త ప్రాజెక్ట్‌ను డీవీ4(DV4)గా ప్రారంభించడం సరైన విధానం కాదని నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ధృవ్‌ను సంప్రదించగా, ముందుగా మైత్రి సినిమా పూర్తి చేసి తర్వాత తమ సినిమాను చేస్తానని ఆయన చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన తమకు ఆర్థిక నష్టం, వడ్డీ భారం తప్పదని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని నిర్మాతల మండలి పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో ధృవ్ విక్రమ్ కెరీర్లో కమిట్మెంట్లకు సంబంధించిన డిస్కషన్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అనౌన్స్ చేసిన కొన్ని ప్రాజెక్టులు కూడా వివిధ కారణాలతో నిలిచిపోయాయి. తాజా వివాదంపై మాత్రం ధృవ్ విక్రమ్ ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.








