నాగబంధం కోసం దేశవ్యాప్త ప్రమోషన్ టూర్.. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్లాన్!
పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కిన భారీ విజువల్ అడ్వెంచర్ ఫిల్మ్ నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్(Naga bandham- the secret tresure) రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. డైరెక్టర్ అభిషేక్ నామా(Abhishek nama) రూపొందిస్తున్న ఈ సినిమా కోసం మేకర్స్ ప్రత్యేకంగా పాన్ ఇండియా ప్రమోషనల్ టూర్‌ను ప్రకటించడం ఆసక్తిని మరింత పెంచింది. జూన్ 19న హైదరాబాద్‌లో గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో ఈ ప్రచార యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 20న ముంబై, జూన్ 21న చెన్నై, జూన్ 22న బెంగళూరు, జూన్ 23న కొచ్చిలో చిత్రబృందం అభిమానులను, మీడియాను ప్రత్యక్షంగా కలుసుకోనుంది. దీంతో దేశంలోని ప్రధాన మార్కెట్లలో సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి.
ఈ ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో అత్యంత ప్రత్యేక ఆకర్షణగా జూన్ 26న వారణాసిలో జరగనున్న వీర నాగ(veera naga) సాంగ్ రిలీజ్ కార్యక్రమం నిలవనుంది. ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఈ నగరంలో సాంగ్ లాంచ్ నిర్వహించడం ద్వారా సినిమాకు ఉన్న పౌరాణిక నేపథ్యాన్ని మరింత బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. అనంతరం జూన్ 28న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్, జూలై 2న ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించనున్నారు. జూలై 3న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
విరాట్ కర్ణ(virat karna), నభా నటేష్(nabha natesh), ఐశ్వర్య మీనన్(Aishwarya menon), జగపతిబాబు(jagapathi babu) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా స్టార్ హీరోల ఇమేజ్‌పై కాకుండా కథ, విజువల్స్‌పైనే ఆధారపడుతోంది. నిర్మాతలు కిషోర్ అన్నాపురెడ్డి(kishore annapureddy), నిషిత నాగిరెడ్డి(nishitha nagireddy) భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాకు ఇప్పటికే నాన్ థియేట్రికల్ హక్కులు మంచి ధరలకు అమ్ముడైనట్లు సమాచారం. విదేశీ మార్కెట్లు, ఉత్తర భారత పంపిణీ బాధ్యతలను జీ స్టూడియోస్(zee studios) చేపట్టడం కూడా సినిమాపై నమ్మకాన్ని పెంచుతోంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్, పౌరాణిక అంశాలు, వ్యూహాత్మక ప్రమోషన్‌తో నాగబంధం ఈ ఏడాది ఆసక్తికరమైన పాన్ ఇండియా సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.








