Erra Cheera: ఘనంగా ఎర్ర చీర ప్రీ రిలీజ్ ఈవెంట్
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. మంగళవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ తో పాటు మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిథి మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ..
“ట్రైలర్ చూశాక చాలా కొత్తగా అనిపించింది. మూవీ టీమ్ కి నా అభినందనలు. ఫిబ్రవరి 6న నేను కచ్చితంగా టికెట్ కొనుక్కుని సినిమా చూస్తా. చిన్నారి తేజస్విని యాక్టింగ్ బాగుంది. చిన్న సినిమాలకు ప్రోత్సాహం లభించాలి. సీఎం రేవంత్ గారు అందుకు కృషి చేస్తున్నారు. చిన్న నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ సినిమాలు తీస్తున్నారు. ఎర్ర చీర సినిమా విజయవంతంగా ఆడాలని కోరుకుంటున్నా.” అన్నారు.
నిర్మాతలలో ఒకరైన సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. “మా సినిమాకు పని చేసిన నాటినటులందరికి కృతజ్ఞతలు. 300 థియేటరస్ లో మా సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇందుకు సహకరించిన పెద్దలకు ధన్యవాదములు. నేను నిర్మాతగా నాలుగు సినిమాలు చేశా. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతున్న” అన్నారు
జయలక్ష్మి ఫిలిమ్స్ వెంకట్రావ్ మాట్లాడుతూ.. “సుమన్ గారికి మంచి భవిష్యత్ ఉంది. సినిమా చూస్తున్నంత సేపు కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇదే పెద్ద సినిమా అవుతుంది. బి, సి సెంటర్స్ లో హిట్ అవుతుంది.” అన్నారు.
హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ.. “ట్రైలర్ చూశాక చాలా బాగా అనిపించింది. మూవీ మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.” అన్నారు.
రైటర్ గోపి మాట్లాడుతూ.. “ఈ సినిమా తీయడానికి మేము పడిన కష్టాలు వర్ణనతీతం. సుమన్ బాబు గారు నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు. మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది.” అన్నారు.
నటుడు, దర్శకుడు, నిర్మాత సుమన్ బాబు మాట్లాడుతూ.. “ఎర్ర చీర సినిమాను ఈ స్థాయికి తెచ్చింది మీడియానే. మధు యాష్కి అన్నకి థాంక్స్. సినిమా గురించి నేను అంతా ఇప్పటికే చెప్పేసాను. బుక్ మై షోలో సప్తగిరి థియేటర్లో మా సినిమా బుకింగ్ చూసి సంతోషపడ్డా. కారుణ్య ఈ మూవీకి వన్ మాన్ ఆర్మీ షో. చిన్నారి సాయి తేజస్విని యాక్టింగ్ సూపర్బ్. సినిమా ఎక్కడ బోర్ కొట్టినా టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. ఫిబ్రవరి 6 సినిమా గ్రాండ్ సక్సెస్ కానుంది. అందరూ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.
నిర్మాత, నటుడు, పీఆర్వో సురేష్ కొండేటి మాట్లాడుతూ.. “చిన్న సినిమాల డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా సినిమా కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. అందుకే ఈ సినిమాకు అండగా నిలబడ్డాను. ఇందులో ఒక మంచి పాత్రలో నటించాను. సినిమా మొత్తం నేను చూశాను. నా ఎక్స్పీరియన్స్ తో చెబుతున్నా.. సుమన్ బాబు ఒక మంచి సినిమా తీశారు. ఫిబ్రవరి 6న సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అందరూ తప్పకుండా థియేటర్ లోనే సినిమా చూడండి.” అన్నారు.






