Varanasi movie updates: రాజమౌళి-మహేశ్ బాబు ‘వారణాసి’ క్రేజ్.. ఓటీటీ ఆఫర్ల వర్షం, ఎంతంటే?
Varanasi movie updates: టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ (SSMB29). పాన్-వరల్డ్ స్థాయిలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచే బాక్సాఫీస్ రికార్డులపై భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు ఈ చిత్రం బిజినెస్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.
ఓటీటీ ఆఫర్ :
తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 650 కోట్ల భారీ ఆఫర్‌ను ప్రకటించినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే, భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఓటీటీ డీల్ అవుతుంది. అయితే, ఈ భారీ ఆఫర్‌ను చిత్ర బృందం తిరస్కరించిందనే ప్రచారం కూడా జరుగుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, మేకర్స్ దాదాపు రూ. 1000 కోట్ల వరకు ఆశిస్తున్నట్లు సమాచారం.
సినిమా ప్రత్యేకతలు :
ఈ భారీ అడ్వెంచర్ డ్రామాలో మహేశ్ బాబు ‘రుద్ర’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా, ఈ సినిమాలో మహేశ్ బాబు ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో మెరిసి అలరించనున్నారని సమాచారం. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇందులో ‘మందాకిని’ పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్ కూడా ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఇటీవల మహేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విన్నప్పుడు తనకు చాలా భయమేసిందని చెప్పడం సినిమాపై ఉన్న సీరియస్‌నెస్‌ను తెలియజేస్తోంది.
విడుదల :
సినిమా థియేట్రికల్ రన్‌ను కాపాడటం కోసం విడుదలైన 8 వారాల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఈ భారీ దృశ్యకావ్యాన్ని 2027 ఏప్రిల్ 7వ తేదీన ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతోంది.






