ఆది సాయికుమార్, రాజేష్ దండా, హాస్య మూవీస్ ‘సైరాబాను’ ఫస్ట్ లుక్ రిలీజ్..
ఆది సాయికుమార్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సైరాబాను’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. విభిన్నమైన ప్రేమకథ, ఆసక్తికరమైన పాత్రలు, వినోదంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. “A Fun Filled Journey of Love, Faith & Destiny” అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ఆది సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునే లుక్‌లో కనిపిస్తున్నారు. తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి, నుదుటిపై విభూది, మెడలో రుద్రాక్ష మాలలతో రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై ప్రయాణిస్తున్నట్టుగా కనిపించారు. ఆయన వెనుక హీరోయిన్ బాంధవి శ్రీధర్ నల్లటి హిజాబ్ ధరించి కూర్చుంది. ఆమె ఆది భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసుకున్న తీరు వారి మధ్య ప్రేమను హైలైట్ చేస్తోంది.
ఫస్ట్ లుక్‌లోని బ్యాక్‌డ్రాప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు ఆలయం, మరోవైపు ఇస్లామిక్ నిర్మాణ శైలిని ప్రతిబింబించే కట్టడాలు కనిపిస్తున్నాయి. రెండు విభిన్న మతాలు, సంస్కృతుల కలయికను ఈ విజువల్ సూచిస్తోంది. చుట్టూ ఎగురుతున్న తెల్లని పావురాలు శాంతి, సామరస్యం, ప్రేమకు ప్రతీకగా నిలుస్తూ స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని అందంగా ప్రతిబింబిస్తున్నాయి.
ప్రేమ, మతం, సంస్కృతుల మధ్య ఉన్న భిన్నత్వాన్ని ఆసక్తికరమైన కథాంశంతో మేళవించిన సినిమా ఇదని ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్, బిహైండ్ ది సీన్స్ వీడియోలకు మంచి స్పందన రాగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కదలి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.








