అనిల్ అంబానీకి సుప్రీం షాక్.. బాంబే హైకోర్టు తీర్పును సమర్థిస్తూ పిటిషన్ కొట్టివేత!
Anil Ambani: రిలయన్స్ కమ్యూనికేషన్స్ , తన వ్యక్తిగత ఖాతాలను ‘మోసపూరితమైనవి’గా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అనిల్ అంబానీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో బ్యాంకులు తదుపరి చర్యలు తీసుకునేందుకు బాంబే హైకోర్టు ఇచ్చిన అనుమతిని సమర్థిస్తూ, అత్యున్నత న్యాయస్థానం అనిల్ అంబానీ విన్నపాన్ని తిరస్కరించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు కీలక నిర్ణయం వెలువరించింది.
సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కోర్టు రద్దు..
గతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు అనిల్ అంబానీ ఖాతాలను ఫ్రాడ్ (Fraud)గా గుర్తించాయి. దీనిపై ఆయన బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్‌ను ఆశ్రయించగా, అప్పట్లో స్టే లభించింది. అయితే, బ్యాంకులు , ఆడిట్ సంస్థలు ఈ తీర్పును డివిజన్ బెంచ్ వద్ద సవాలు చేయగా, సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. దీనిని సవాలు చేస్తూ అంబానీ సుప్రీంకోర్టుకు వెళ్లగా, అక్కడ కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.
వెసులుబాటు..
సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, అనిల్ అంబానీకి ఒక చిన్న వెసులుబాటు లభించింది. బ్యాంకులు జారీ చేసిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ వద్ద తన వాదనలు వినిపించుకోవడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
ఇవి కూడా చదవండి








