లక్ష కోట్ల నుంచి జీరోకు.. బైజూస్ పతనానికి కారణం వైఫల్యం కాదు.. ఆ ‘భారీ సక్సెస్సే’!
ఒకప్పుడు భారతదేశపు స్టార్టప్ ప్రపంచంలో అదొక మకుటం లేని మహారాజు. చదువుకునే ప్రతి పిల్లాడి ఇంట్లో, ప్రతి తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌లో ఆ యాప్ ఉండాల్సిందే. ఏకంగా 22 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.8 లక్షల కోట్లు) మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్టెక్ (EdTech) సంస్థగా రికార్డులు సృష్టించిన ‘బైజూస్‘ (BYJU’S) ఇప్పుడు అక్షరాలా ‘సున్నా’ (Zero)కు పడిపోయింది. అయితే ఇక్కడే నమ్మశక్యం కాని నిజం దాగుంది. బైజూస్ పతనానికి కారణం వారి వైఫల్యాలు కాదు.. వారు సాధించిన ఊహించని ‘భారీ సక్సెస్సే’! అవును, మీరు విన్నది నిజమే.
సక్సెస్ మత్తులో కళ్లు మూసుకుపోయి..
కరోనా లాక్డౌన్ సమయం బైజూస్‌కు (BYJU’S) ఒక వరంగా మారింది. స్కూళ్లు మూతపడటంతో ఆన్లైన్ విద్యకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ బూమ్‌లో బైజూస్ అకౌంట్లో కోట్లకు కోట్లు వచ్చిపడ్డాయి, మార్కెట్ విలువ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. సరిగ్గా ఇక్కడే బైజూస్ యాజమాన్యం సక్సెస్ మత్తులో పడిపోయి అతిపెద్ద తప్పు చేసింది. సంస్థ మౌలిక పునాదిని బలోపేతం చేసుకోవడం మానేసి, కేవలం ‘గ్రోత్’ (Growth) మాత్రమే లక్ష్యంగా గుడ్డిగా పరుగులు తీసింది. పెట్టుబడిదారులను మభ్యపెట్టేందుకు లాభాలతో సంబంధం లేకుండా సంస్థను (BYJU’S) విపరీతంగా విస్తరించడం మొదలుపెట్టింది.
ఇవి కూడా చదవండి
అడ్డగోలు కొనుగోళ్లు.. విషపూరిత సంస్కృతి!
విపరీతంగా వస్తున్న డబ్బును చూసి బైజూస్ విచక్షణ కోల్పోయింది. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, వైట్‌హ్యాట్ జూనియర్ (WhiteHat Jr) సహా దేశ, విదేశాల్లోని ఎన్నో చిన్న, పెద్ద కంపెనీలను అడ్డగోలు ధరలకు గుత్తగుత్తగా కొనుగోలు చేసింది. దీనికోసం మార్కెట్లో వేల కోట్లు అప్పులు (BYJU’S) చేసింది. మరోవైపు తల్లిదండ్రులను భయపెట్టి, మభ్యపెట్టి మరీ కోర్సులు విక్రయించే ఒక విషపూరితమైన సేల్స్ సంస్కృతికి తెరలేపింది. తమ టార్గెట్లు రీచ్ అయ్యేందుకు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది. ఇదంతా బయటికి పెట్టుబడిదారులకు ఒక పెద్ద ‘సక్సెస్’లాగా కనిపించినా, లోపల మాత్రం సంస్థ పునాదులు పూర్తిగా కుళ్లిపోయాయి.
బుడగ పగిలింది..!
కరోనా వెళ్లిపోయింది.. స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో ఆన్లైన్ క్లాసులకు ఒక్కసారిగా డిమాండ్ పాతాళానికి పడిపోయింది. ఆ క్షణమే బైజూస్ (BYJU’S) అసలు బాగోతం బయటపడింది. అడ్డగోలుగా చేసిన కొనుగోళ్లకు డబ్బులు చెల్లించలేక, తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టలేక, రోజువారీ ఖర్చులు భరించలేక సంస్థ చేతులెత్తేసింది. పెట్టుబడిదారులు ఒక్కొక్కరుగా పారిపోవడం, బోర్డు మెంబర్ల వరుస రాజీనామాలు, కోర్టుల్లో కేసులు, ఉద్యోగుల పట్ల నిర్దాక్షిణ్యమైన లేఆఫ్స్‌తో సంస్థ పరువు బజారున పడింది.
ఒకప్పుడు 22 బిలియన్ డాలర్ల అద్భుతమైన విలువతో వెలిగిన బైజూస్ (BYJU’S) సామ్రాజ్యం.. ఇప్పుడు పేకమేడలా కూలిపోయి జీరో వాల్యుయేషన్‌కు పడిపోయింది. ఇది కచ్చితంగా ప్రస్తుత స్టార్టప్ ప్రపంచానికి ఒక పెద్ద చెంపపెట్టు. స్థిరమైన పునాది, సరైన ప్రణాళిక లేని ఏ అడ్డగోలు సక్సెస్ అయినా.. చివరికి ఇంతటి ఘోర పతనానికే దారితీస్తుందని బైజూస్ ఉదంతం నిరూపించింది.
ఇవి కూడా చదవండి







