ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. కేంద్రం టార్గెట్ రూ. 10 వేల కోట్లు!
దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల (PSU) షేర్లపై ఆసక్తి ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దేశంలోనే అతిపెద్ద బీమా దిగ్గజం ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా‘ (LIC Investment)లో మరో విడత వాటాల విక్రయానికి రంగం సిద్ధం చేసింది. ఎప్పటినుంచో దలాల్ స్ట్రీట్‌లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలకు బలం చేకూరుస్తూ, జూన్ నెలాఖరులో లేదా జూలై మొదటి వారంలో ఈ మెగా డీల్ పట్టాలెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రూ. 10,000 కోట్లే లక్ష్యంగా స్కెచ్..
తాజా మార్కెట్ సమాచారం ప్రకారం, ఎల్ఐసీలో తమకున్న వాటాలోంచి సుమారు 2 శాతం వాటాను (LIC Investment) సంస్థాగత పెట్టుబడిదారులకు విక్రయించాలని కేంద్రం యోచిస్తోంది. కేవలం ఈ 2 శాతం షేర్ల అమ్మకం ద్వారానే మార్కెట్ నుంచి ఏకంగా రూ. 10,000 కోట్లను సమీకరించాలని కేంద్రం భారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తెరవెనుక మాత్రం డీల్‌కు సంబంధించిన కసరత్తు శరవేగంగా సాగుతోంది. ఈ వాటాల అమ్మకం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున నిధులు సమకూరుతాయి.
ఇవి కూడా చదవండి
రంగంలోకి గ్లోబల్ ఆర్థిక దిగ్గజాలు!
ఇంత భారీ లావాదేవీని సాఫీగా పూర్తి చేయడం చిన్న విషయం కాదు. అందుకే కేంద్ర ప్రభుత్వ పెట్టుబడులు (LIC Investment), ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (DIPAM – దీపమ్) అగ్రశ్రేణి గ్లోబల్, దేశీయ ఫైనాన్షియల్ సంస్థలను రంగంలోకి దించింది. ఈ మెగా డీల్ నిర్వహణ కోసం గోల్డ్‌మన్ శాక్స్, బీఎన్పీ పరిబాస్ వంటి అంతర్జాతీయ బ్యాంకులు సేవలు అందిస్తున్నాయి. దేశీయంగా ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ (IIFL), మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal) ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో దీపమ్ అధికారులు కలిసి పనిచేస్తున్నారు. అయితే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున వాటాల విక్రయ శాతం, విక్రయించే తేదీలు, డీల్ (LIC Investment) విలువలో రాబోయే రోజుల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం కూడా లేకపోలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఎందుకు అమ్ముతోంది?
ఎల్ఐసీలో వాటాల విక్రయం (LIC Investment) వెనుక ఒక పక్కా వ్యూహం, చట్టపరమైన బాధ్యత దాగి ఉంది. 2022లో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీఓ (IPO)ను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో 3.5 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఏకంగా రూ. 21,000 కోట్లను ప్రభుత్వ ఖజానాకు జమ చేసింది. ఈ ఐపీఓ తర్వాత కూడా ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం. ఏకంగా 96.5 శాతం వాటా ఇంకా కేంద్రం చేతిలోనే ఉంది. కానీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నిబంధనల ప్రకారం.. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఏ కంపెనీలోనైనా కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (సాధారణ ఇన్వెస్టర్ల వాటా) 25 శాతం ఉండాలి.
ఈ కఠిన నిబంధనను చేరుకునేందుకు కేంద్రానికి 2032 వరకు సెబీ సుదీర్ఘ గడువు ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని ఒకేసారి కాకుండా, మార్కెట్ ఒడిదుడుకులను బేరీజు వేసుకుంటూ దశలవారీగా చేరుకోవాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం ఇప్పుడు మరో 2 శాతం వాటాను మార్కెట్లో (LIC Investment) రిలీజ్ చేయబోతోంది. రాబోయే రోజుల్లో ఈ డీల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తే దలాల్ స్ట్రీట్‌లో ఎల్ఐసీ షేర్లకు మళ్లీ రెక్కలు రావడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి







