ఏపీ రైతులను దెబ్బ కొట్టిన జపాన్..!
భారత మామిడి పండ్లపై జపాన్(Japan) ప్రభుత్వం విధించిన తాజా నిషేధం ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ఖమ్మం(Khammam), విజయనగరం జిల్లాల మామిడి రైతులకు మరియు ఎగుమతిదారులకు పెద్ద షాక్‌గా మారింది. ఏపీలో అత్యధికంగా పండే, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ‘బంగినపల్లి’ రకం మామిడి కాయల ఎగుమతులపై ఈ నిర్ణయం కోలుకోలేని దెబ్బ తీయనుంది. జపాన్ మార్కెట్లో ఏపీ మామిడి పండ్లకు చాలా ఎక్కువ ధర లభిస్తుండటంతో, ఈ నిషేధం వల్ల ఇక్కడి వ్యాపారులు, రైతులు కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
నిజానికి ఏపీ నుండి జపాన్‌కు మామిడి కాయలను ఎగుమతి చేసే ముందు నాణ్యతా ప్రమాణాల కోసం వాటికి వేపర్ హీట్ ట్రీట్మెంట్ (VHT) చేయడం తప్పనిసరి. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని ఒక ట్రీట్మెంట్ ప్లాంట్‌లో క్వారంటైన్ నిబంధనలు, పురుగుల నివారణ ప్రక్రియల్లో లోపాలు ఉన్నట్లు జపాన్ ఫుడ్ అఫీషియల్స్ గుర్తించారు. జపాన్ దేశం పండ్ల ఈగల విషయంలో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని పాటిస్తుంది. ఒక ప్రాంతంలో లోపం జరిగినా, దాని ప్రభావం దేశవ్యాప్త ఎగుమతులపై పడటంతో ఏపీలోని అత్యాధునిక ప్యాక్ హౌస్‌ల ద్వారా ఎగుమతి చేసే రైతులు కూడా ఇప్పుడు నష్టపోవాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ ఏడాది ఇప్పటికే ఏపీలోని మామిడి రైతులకు వాతావరణం ఏమాత్రం కలిసిరాలేదు. ఎల్ నినో ప్రభావం వల్ల మార్చి, ఏప్రిల్ నెలల్లో నమోదైన విపరీతమైన ఎండలు, అకాల వాతావరణ మార్పుల కారణంగా పూత ఎండిపోయి, కాయ రాలిపోయి ఇప్పటికే 60 శాతం పైగా పంట నష్టం వాటిల్లింది. దిగుబడి తగ్గి కష్టాల్లో ఉన్న రైతులకు, అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధర దక్కుతుందనే ఆశ ఉండేది. కానీ కచ్చితంగా సీజన్ పీక్ స్టేజ్‌కు చేరే సమయంలో జపాన్ ఈ నిషేధాన్ని విధించడం ఏపీ మామిడి రైతులకు గోరుచుట్టుపై రోకటిపోటులా మారింది.
ఇప్పుడు ఏపీ ఎగుమతిదారులు భయపడుతున్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. జపాన్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా భారతీయ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్స్‌పై నమ్మకం తగ్గే అవకాశం ఉంది. జపాన్ బ్యాన్‌ను చూసి ఏపీ మామిడిని భారీగా దిగుమతి చేసుకునే ఇతర యూరోపియన్ యూనియన్ (EU) దేశాలు లేదా గల్ఫ్ దేశాలు కూడా తనిఖీలను కఠినతరం చేస్తే ఏపీ మామిడి మార్కెట్ పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. ఏపీ ప్రభుత్వం, అపెడా (APEDA) అధికారులు తక్షణమే స్పందించి కేంద్రంతో మాట్లాడి, ఈ సాంకేతిక లోపాలను సవరించి జపాన్‌తో మళ్లీ చర్చలు జరపాలని రైతులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి







