SRH vs CSK: ఉప్పల్‌లో ‘ఆరెంజ్’ వర్సెస్ ‘ఎల్లో’ వార్..!
ఐపీఎల్(Ipl) 2026లో నేడు మరో రసవత్తర పోరుకు తెరలేవనుంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. సొంత గడ్డపై హైదరాబాద్ తన జోరును ప్రదర్శించాలని చూస్తుంటే, గత రెండు మ్యాచ్ ల నుంచి బలంగా కనపడుతోన్న.. చెన్నైని అడ్డుకోవడం వారికి సవాల్‌గా మారింది. ఉప్పల్ పిచ్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ సీజన్లో ఇప్పటికే ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లో బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు బోర్డుపై ఉంచాలని భావిస్తుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ(Abhishek Sharma) జోడీ పవర్ ప్లేలో ఇచ్చే స్టార్ట్ ఎస్ఆర్హెచ్కి అతిపెద్ద బలం కానుంది. క్లాసెన్ ఫినిషింగ్ టచ్ ఇస్తే స్కోరు 220 దాటడం ఖాయంగా కనపడుతోంది. గత మ్యాచ్ తో ప్రఫుల్ హింగే ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో అతని ప్రభావం చెన్నైపై పడే ఛాన్స్ కనపడుతోంది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫాం చెన్నైకి మైనస్ కాగా.. సంజు సామ్సన్ ఫాంలో ఉండటం కలిసి వచ్చే అంశం. మిడిల్ ఆర్డర్ లో సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే రాణిస్తే చెన్నై భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ తో ధోనీ(Dhoni).. ఈ సీజన్ ప్రారంభించే అవకాశం ఉంది. దీనితో ఆఖరి ఓవర్లలో ధోని మెరుపులు చూసేందుకు ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా తప్పుకోవడం చెన్నై బౌలింగ్‌కు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. అయితే నూర్ అహ్మద్ ఫాంలోకి రావడం కలిసి వచ్చే అంశం.
గత రికార్డులను పరిశీలిస్తే చెన్నై పైచేయి సాధించినప్పటికీ, ఉప్పల్ స్టేడియంలో హోమ్ సపోర్ట్‌తో హైదరాబాద్‌ను తక్కువ అంచనా వేయలేం. స్పిన్నర్లు నూర్ అహ్మద్, శివాంగ్ కుమార్ మధ్య పోరు కూడా ఆసక్తికరంగా ఉండనుంది. పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలంటే ఇరు జట్లకు ఈ విజయం చాలా అవసరం. మరి ‘ఆరెంజ్ ఆర్మీ’ ఉప్పల్‌ను కోటగా మలుచుకుంటుందో.. లేదా చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్‌ను వంచిస్తుందో చూడాలి.








