SRH: సన్ రైజర్స్ కు పాక్ బోర్డు షాక్..!
పహల్గాం ఉగ్రదాడి తర్వాత, భారత్ లో పాక్ మాట వింటేనే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇలాంటి టైంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను ‘ది హండ్రెడ్’ (The Hundred) 2026 సీజన్లో సన్‌రైజర్స్ లీడ్స్ (Sunrisers Leeds) యాజమాన్యం కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రూ. 2.34 కోట్లకు (1,90,000 పౌండ్లు) ఆయనను కొనుగోలు చేసినప్పటికీ, కొన్ని సాంకేతిక, షెడ్యూల్ కారణాల వల్ల ఆయన ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని యాజమాన్యం అంటుంది.
అబ్రార్ అహ్మద్(Abrar Ahmed) ఆడే అవకాశం లేకపోవడానికి ప్రధాన కారణాలు ఒకసారి చూస్తే.. పాకిస్థాన్ జట్టు జూలై 15 నుండి ఆగస్టు 7, 2026 వరకు వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ‘ది హండ్రెడ్’ టోర్నీ జూలై 21న ప్రారంభమై ఆగస్టు 16 వరకు జరుగుతుంది. ఈ రెండు షెడ్యూల్స్ ఒకే సమయంలో ఉండటంతో అబ్రార్ అందుబాటులో ఉండటం కష్టంగా మారింది. జాతీయ జట్టు మ్యాచ్‌లు ఉన్న సమయంలో విదేశీ లీగ్‌లలో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) సాధారణంగా నిరభ్యంతర పత్రం (NOC) మంజూరు చేయదు. అబ్రార్‌కు ఇంకా ఎన్వోసీ లభించలేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఆడే అవకాశాలు కేవలం 50-50 మాత్రమేనని పీసీబీ వర్గాలు వెల్లడించాయి.
సన్‌రైజర్స్ యాజమాన్యం పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గతంలో అబ్రార్ భారత సైన్యాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేశారనే ఆరోపణలతో నెటిజన్లు #BoycottSRH హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. ఈ ఒత్తిడి కారణంగా కూడా ఫ్రాంచైజీ పునరాలోచనలో పడే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ లీడ్స్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరీ మాట్లాడుతూ, ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌ను దక్కించుకోవడంలో ఫెయిల్ కావడంతోనే.. నాణ్యమైన స్పిన్నర్ కోసం అబ్రార్‌ను ఎంచుకున్నామని తెలిపారు. అయితే, ఒకవేళ అబ్రార్‌కు ఎన్వోసీ రాకపోతే, సన్‌రైజర్స్ లీడ్స్ ఆయన స్థానంలో మరో విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అబ్రార్ ఈ లీగ్‌లో ఆడటం అనేది పూర్తిగా పాక్ బోర్డు ఇచ్చే అనుమతిపైనే ఆధారపడి ఉంది.








