IPL 2026: నేటి నుంచే అసలైన క్రికెట్ పండుగ..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) మళ్లీ వచ్చేసింది. నేటి (శనివారం) నుంచి ఐపీఎల్ 19వ సీజన్ మహా సంగ్రామం ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే హై-ఓల్టేజ్ ఓపెనింగ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. నేటి నుంచి మే 24 వరకు లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా, మే 31న జరిగే గ్రాండ్ ఫైనల్‌తో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది.
ప్రారంభ వేడుకలకు బ్రేక్..
సాధారణంగా ఐపీఎల్ (IPL 2026) అనగానే కళ్లుచెదిరే ప్రారంభ వేడుకలు (Opening Ceremony) ఉండటం ఆనవాయితీ. కానీ ఈ ఏడాది ఎలాంటి వేడుకలు లేకుండానే టోర్నీ మొదలుకానుంది. దీనికి ఒక తీవ్రమైన విషాదకర నేపథ్యం ఉంది. గత ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలిచిన సందర్భంగా జరిగిన విజయోత్సవాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. బాధితుల కుటుంబాలకు గౌరవం, సానుభూతి ప్రకటిస్తూ బీసీసీఐ ఈసారి ఓపెనింగ్ సెర్మనీని రద్దు చేసింది. అయితే ఫైనల్ రోజున ముగింపు వేడుకలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని బోర్డు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి
10 జట్లకు ‘దేశీ’ సారథులే
ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్‌కు ఒక అరుదైన ప్రత్యేకత ఉంది. టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా మొత్తం 10 ఫ్రాంచైజీలకు భారతీయ ఆటగాళ్లే (Indian Captains) నాయకత్వం వహిస్తున్నారు. ముంబైకి హార్దిక్ పాండ్యా, చెన్నైకి రుతురాజ్, ఢిల్లీకి అక్షర్ పటేల్, పంజాబ్‌కు శ్రేయస్ అయ్యర్, కేకేఆర్‌కు రహానే, లక్నోకు రిషబ్ పంత్, గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్, ఆర్సీబీకి రజత్ పటిదార్, రాజస్థాన్‌కు రియాన్ పరాగ్ లాంటి స్టార్లు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావడంతో.. అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను తాత్కాలిక సారథిగా నియమించారు. దీంతో అన్ని జట్లకు భారతీయులే కెప్టెన్లు కావడం విశేషం.
ఫార్మాట్ ఎలా ఉండబోతోంది?
2022 నుంచి అమలు చేస్తున్న పాత గ్రూప్ ఫార్మాట్‌నే ఈసారి (IPL 2026) కూడా కొనసాగించనున్నారు. 10 జట్లను గ్రూప్-ఏ, గ్రూప్-బి గా విభజించారు. ప్రతి జట్టూ లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతుంది. (తమ గ్రూప్‌లోని జట్లతో పాటు, ఇతర గ్రూప్‌లోని జట్లతో). మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక, పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు (క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2) అర్హత సాధిస్తాయి. ఆరో కప్పు కోసం చెన్నై, ముంబై గట్టిగా పోటీ పడుతుండగా, టైటిల్ నిలబెట్టుకోవాలని ఆర్సీబీ ఉవ్విళ్లూరుతోంది. ఇక తమ తొలి కప్పు కలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని పంజాబ్, ఢిల్లీ, లక్నో జట్లు పట్టుదలగా బరిలోకి దిగుతున్నాయి.
ఇవి కూడా చదవండి








