SRH vs RCB: ఐపీఎల్ చరిత్రలో ఇషాన్ కిషన్ అరుదైన రికార్డు..!
ఐపీఎల్ 2026(IPL 2026) సీజన్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) ఒక సరికొత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్ లో మ్యాచ్‌లో జట్టు పగ్గాలు చేపట్టడం ద్వారా, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. కేవలం 27 ఏళ్ల 253 రోజుల వయస్సులోనే ఈ బాధ్యతను చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, మనీష్ పాండేలు కెప్టెన్లుగా వ్యవహరించారు.
అయితే వారందరినీ వెనక్కి నెట్టి, అతి తక్కువ వయస్సులో జట్టును నడిపించిన భారత సారథిగా ఇషాన్ కిషన్ అగ్రస్థానంలో నిలిచాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా అందుబాటులో లేకపోవడంతో, జట్టు యాజమాన్యం ఇషాన్ కిషన్‌పై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతను అప్పగించింది. అంతేకాకుండా, ఎస్ఆర్హెచ్ తరపున ఐపీఎల్లో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా కూడా ఇషాన్ కిషన్ ఇప్పటికే రికార్డు సృష్టించాడు. గతంలో ఈ జట్టు తరపున కేవలం విదేశీ ఆటగాళ్లు మాత్రమే శతకాలు బాదగా, ఆ లోటును ఇషాన్ తీర్చాడు.
తాజాగా కెప్టెన్సీ రికార్డుతో పాటు, తన ఐపీఎల్ కెరీర్లో 3,000 పరుగుల మార్కును కూడా ఈ మ్యాచ్‌తోనే అతను అధిగమించాడు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజేతగా నిలవడంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. అదే ఫామ్‌ను ఇప్పుడు ఐపీఎల్‌లోనూ కొనసాగిస్తూ, అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు నాయకత్వంలోనూ తన ముద్ర వేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ముంబై ఇండియన్స్ నుండి ఎస్ఆర్హెచ్లోకి మారిన తర్వాత ఇషాన్ కెరీర్ మరో మలుపు తిరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.








