FIH Hockey: క్వాలిఫయర్స్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
హైదరాబాద్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ (FIH Hockey) మహిళల హాకీ వరల్డ్ క్వాలిఫయర్స్ తుదిపోరులో భారత జట్టుకు నిరాశే మిగిలింది. శనివారం హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 2-0 గోల్స్ తేడాతో భారత్‌పై విజయం సాధించి టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఫైనల్లో ఓటమిపాలైనప్పటికీ, అంతకుముందే టైటిల్ పోరుకు చేరుకోవడం ద్వారా భారత మహిళల జట్టు ఈ ఏడాది జరగనున్న ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్ కప్‌కు (FIH Hockey) సగర్వంగా అర్హత సాధించడం గమనార్హం. టోర్నీ విజేతగా నిలిచి ఉంటే ఆ ఆనందం రెట్టింపు అయ్యేదే కానీ, ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవడం అభిమానులకు కొంత ఊరటనిచ్చింది.
పెనాల్టీల వైఫల్యం..
టోర్నీ (FIH Hockey) ఆరంభం నుంచి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్న టీమిండియా.. నిర్ణయాత్మక ఫైనల్లో మాత్రం ఒత్తిడిని అధిగమించలేకపోయింది. మ్యాచ్ ప్రారంభంలో భారత డిఫెండర్లు పటిష్టమైన వ్యూహాలతో ఇంగ్లాండ్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నారు. కానీ ఫార్వర్డ్ లైనప్‌లో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. దొరికిన చక్కటి గోల్ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో స్ట్రైకర్లు తడబడ్డారు. ముఖ్యంగా మ్యాచ్‌లో (FIH Hockey) లభించిన నాలుగు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచలేక భారత్ భారీ మూల్యం చెల్లించుకుంది.
ఆరంభం నుంచే ఇంగ్లాండ్ ఆధిపత్యం
మరోవైపు ఇంగ్లాండ్ కచ్చితమైన వ్యూహంతో ఆడి సత్ఫలితాలు సాధించింది. ఆట 13వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గ్రేస్ బాల్సన్ (Grace Balsdon) చాకచక్యంగా గోల్‌గా మలిచి ఇంగ్లాండ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత కూడా పట్టు వదలకుండా ఆడిన ఆ జట్టు.. 43వ నిమిషంలో ఎలిజబెత్ నీల్ (Elizabeth Neal) చేసిన అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని 2-0కు పెంచుకుంది. ఆఖరి క్వార్టర్లో (FIH Hockey) భారత్ ఎంతగా పోరాడినా, పటిష్టమైన ఇంగ్లాండ్ డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఒక్క గోల్ కూడా నమోదు చేయకుండానే ఓటమిని అంగీకరించి టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకుంది.








