AI బూమ్పై అమెరికాలోనే సందేహాలు… అసలు కథ ఏంటి?
AI Investment: AI ప్రపంచాన్ని మార్చేస్తోందని అందరూ చెబుతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ఈ రంగంలో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాయి. కానీ ఇదే విషయం ఇప్పుడు అమెరికాలో కొందరు ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.
అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్లోని కొందరు అనలిస్టులు సిద్ధం చేసిన ఓ అంతర్గత నివేదిక ప్రకారం, ప్రస్తుతం AI కంపెనీల్లో పెరుగుతున్న పెట్టుబడులు గతంలో జరిగిన డాట్కామ్ బబుల్ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. అంటే, కంపెనీల అసలు విలువ కంటే ఎక్కువ అంచనాలతో పెట్టుబడులు పెరుగుతున్నాయనే సందేహం వ్యక్తం చేస్తున్నారు.
వారి ఆందోళన ఏమిటంటే… ఇప్పుడు AI కంపెనీలు స్టాక్ మార్కెట్, బ్యాంకులు, పెద్ద వ్యాపార సంస్థలతో బలంగా ముడిపడి ఉన్నాయి. ఒకవేళ AI రంగంలో ఒక్కసారిగా భారీ పతనం వస్తే, దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
అయితే ఇది అమెరికా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన హెచ్చరిక కాదు. ట్రెజరీ డిపార్ట్మెంట్లోని అంతర్గత విశ్లేషణ ఆధారంగా వచ్చిన సమాచారం మాత్రమే. అయినప్పటికీ, AIపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పెట్టుబడుల నేపథ్యంలో ఈ నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.








