Malla Reddy: “నావల్లే రేవంత్ సీఎం అయ్యారు..” మల్లారెడ్డి హాట్ కామెంట్స్..!!
తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలిలో మాట్లాడుతూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. ఆయన మాటల ప్రవాహం, పంచ్‌లు అక్కడ ఉన్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి.
మల్లారెడ్డి మాటలు మొదలుపెడుతూనే అందరికీ షాక్ ఇచ్చారు. “రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన రెడ్డి సామాజికవర్గ సమావేశాన్ని గుర్తు చేసుకుంటూ.. “ఆ మీటింగ్ లో నేనే చెప్పాను, రెడ్డి సామాజిక వర్గంలో రేవంత్ రెడ్డిని మించిన పవర్ఫుల్ నాయకుడు మరొకరు లేరని. ఎవరు అవునన్నా, కాదన్నా నేను, రేవంత్ రెడ్డి అన్నదమ్ములమే” అని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యర్థులుగా కనిపిస్తున్నా, వారి మధ్య ఉన్న పాత బంధాన్ని ఆయన ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు.
రాజకీయాల నుంచి మాటలు సినిమా వైపు మళ్లాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో తనకు విలన్ పాత్ర ఆఫర్ వచ్చిన విషయాన్ని మల్లారెడ్డి బయటపెట్టారు. “దర్శకుడు హరీష్ శంకర్ నన్ను అడిగారు. సినిమాలో విలన్ క్యారెక్టర్ చేయమని కోరారు. కానీ నేనే వద్దని చెప్పాను” అని వెల్లడించారు. ఎందుకు వద్దన్నారు అని మీడియా మిత్రులు అడగ్గా, తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు. “నాకు సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్ర చేయాలని ఉంది. నేను సీఎం రోల్ చేస్తేనే బాగుంటుంది” అని తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి మాటలు విని మధ్యలో జోక్యం చేసుకున్నారు. మల్లారెడ్డి ‘సీఎం’ కావాలనే కోరికపై తలసాని తనదైన శైలిలో సెటైర్లు వేశారు. “మల్లారెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రి పాత్రకు సెట్ కావు. సినిమాల్లో సీఎం పాత్రలు మహా అయితే రెండు నిమిషాలు ఉంటాయి. అందులో కిక్కు ఉండదు.” అన్నారు. “మరి నాకు ఏ పాత్ర సెట్ అవుతుంది అంటావ్?” అంటూ తలసానిని అడగడంతో.. “నీకు విలన్ పాత్రే కరెక్ట్. నీ హైట్‌కు, నీ వాయిస్‌కు విలన్ పాత్రే పక్కాగా సరిపోతుంది. అసలైన ఎలివేషన్ ఉండేదే విలన్ పాత్రలో. నువ్వు సినిమాల్లోకి వెళ్తే కచ్చితంగా విలన్ గానే చేయి. అప్పుడే సినిమా హిట్ అవుతుంది.” అంటూ తలసాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అసెంబ్లీ సమావేశాల వేళ సీరియస్ రాజకీయ చర్చలు జరుగుతాయని అందరూ భావిస్తే, లాబీల్లో మాత్రం మల్లారెడ్డి తన మార్క్ వినోదాన్ని పంచారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చాటుకుంటూనే, మరోవైపు తన సినిమా ఎంట్రీపై క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి మల్లారెడ్డి సీఎం పాత్ర చేయాలనుకున్నా, తలసాని మాత్రం ఆయన్ని ‘పవర్ఫుల్ విలన్’ గానే చూడాలని ఫిక్స్ అయిపోయారు.
ఇవి కూడా చదవండి








