Hyderabad: ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంతో హైదరాబాద్ నెక్స్ట్ లెవల్ : సీఎం రేవంత్
Hyderabad: అత్యాధునిక ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణతో హైదరాబాద్‌ను అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసన మండలిలో నగర అభివృద్ధిపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ రద్దీని తగ్గించి, కాలుష్య రహిత నగరంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రణాళికలోని అంశాలు:
ట్రాఫిక్ కష్టాలకు చెక్: నగరంలో పెరిగిన వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్లను అండర్‌పాస్‌లు, సర్ఫేస్, ఎలివేటెడ్ కారిడార్లుగా వర్గీకరించినట్లు సీఎం తెలిపారు. ముఖ్యంగా శామీర్‌పేట, మేడ్చల్ వైపు కొత్త ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని, దీనికోసం కేంద్ర రక్షణ శాఖ భూములను తీసుకుంటున్నామని వెల్లడించారు.
మెట్రో విస్తరణ: మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుందని, మరో 76 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ. 15 వేల కోట్లు కేటాయించామని, కేంద్రం కూడా దీనికి సానుకూలంగా ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి
కాలుష్య నివారణ: ఢిల్లీ తరహాలో కాలుష్యం పెరగకుండా ఉండేందుకు ఓఆర్ఆర్ (ORR) లోపల ఉన్న పరిశ్రమలను బయటకు తరలిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించి మూసీ సుందరీకరణను వేగవంతం చేస్తామన్నారు.
ఫ్యూచర్ సిటీ – క్యూర్, ప్యూర్, రేర్: 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. సర్వీస్ సెక్టార్ (CURE), ఇండస్ట్రియల్ సెక్టార్ (PURE), అగ్రికల్చర్ సెక్టార్ (RARE) గా విభజించి నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు.
చిరువ్యాపారులకు భరోసా: ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపులో భాగంగా చిరువ్యాపారులకు ఇబ్బంది కలగకుండా ఇతర ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి








