మంత్రివర్గంలో బీసీల ప్రాతినిధ్యంపై మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీతో మూడేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి వేడిని రాజేస్తోంది. వివాదాల నేపథ్యంలో కొండా సురేఖను క్యాబినెట్ నుండి తప్పించడంతో, బలహీన వర్గాల ప్రాతినిధ్యంపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ సామాజిక వర్గానికి మరో రెండు బెర్తులు కేటాయించాల్సిన అవసరం ఉందని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన సర్వేలో రాష్ట్ర జనాభాలో బీసీలు 56 శాతానికి పైగా ఉన్నారని తేలిందని, ఆ దామాషా ప్రకారం అధికారంలో వారికి తగిన వాటా దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నినాదమైన ‘జిత్నీ ఆబాదీ, ఉత్నీ హిస్సేదారీ’ స్ఫూర్తిని నిలబెట్టాలంటే బీసీలకు అదనపు మంత్రి పదవులు ఇవ్వడం సముచితమని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు తెలంగాణకు భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారన్న తన పాత వ్యాఖ్యలకు మహేష్ గౌడ్ కట్టుబడి ఉన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఓబీసీ నేతలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని గుర్తు చేశారు. తెలంగాణలోనూ ఆ రోజు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా చూడకూడదని ఆయన చాలా జాగ్రత్తగా వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి అధికారంలోకి వస్తే ఆయనే సీఎంగా కొనసాగడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. తద్వారా తనకూ, ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన తెరదించే ప్రయత్నం చేశారు. గతంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని గుర్తు చేసుకుంటూ, తమ మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి
ఇక పార్టీ అంతర్గత వ్యవహారాలపైన కూడా మహేశ్ గౌడ్ స్పందించారు. కొత్తగా నియమితులైన ఏఐసీసీ ఇన్ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ మంచి వ్యూహకర్త అని మహేష్ గౌడ్ కొనియాడారు. ఆయన రాకతో పార్టీ మరింత బలోపేతం కావడంతో పాటు.. పార్టీకి, సీఎంఓకు మధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా సాఫీగా సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితో బహిరంగ విమర్శలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై ఆయన సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఆవేదనలో న్యాయం ఉన్నప్పటికీ, ప్రభుత్వంపై బహిరంగంగా మాట్లాడటం సరికాదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిగిల్చిన భారీ అప్పుల వల్ల కేవలం మునుగోడు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయని విశ్లేషించారు. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని ఏఐసీసీ చూసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తెస్తాయని నమ్ముతున్న కాంగ్రెస్ అధిష్టానం, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా తెలంగాణ నుండి అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో సామాజిక సమతుల్యతను కాపాడుతూ, బీసీల డిమాండ్లను నెరవేర్చడం, అసంతృప్తులను బుజ్జగించడం కాంగ్రెస్ నాయకత్వానికి కత్తిమీద సాములా మారనుంది.







