300 కేసులు.. 20 వారెంట్లు: టార్గెట్‌లో తెలంగాణ నేతలు!
ప్రజాస్వామ్య దేవాలయాలైన చట్టసభల్లో అడుగుపెట్టి, ప్రజల తరఫున గళం వినిపించాల్సిన ప్రజాప్రతినిధుల చుట్టూ న్యాయపరమైన ఉచ్చు బిగుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సహా పలువురు కీలక నేతలపై ఏకంగా 300 వరకు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండటం, అందులో 20 మంది నేతలపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సామాన్యుడికి ఒక నిబంధన, నేతలకు మరో నిబంధన అన్నట్లుగా పోలీసుల వ్యవహారశైలి ఉండటంపై సాక్షాత్తూ తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది.
గత మూడేళ్లలో ప్రజాప్రతినిధులపై కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2023 అక్టోబర్ నాటికి కేవలం 71గా ఉన్న ఈ కేసుల సంఖ్య, అదే ఏడాది డిసెంబర్ నాటికి 202కు చేరింది. 2024 మే లోక్‌సభ ఎన్నికల తర్వాత అంటే జూన్ 2024 నాటికి ఈ సంఖ్య 263 దాటి, 2026 సెప్టెంబర్ 15 నాటికి దాదాపు 300కు చేరుకుంది. ఈ కేసుల్లో అత్యధికంగా 228 హైదరాబాద్ సెషన్స్ జడ్జి కోర్టులో పెండింగ్‌లో ఉండగా, మరో 27 కేసులు సీబీఐ కోర్టు విచారణలో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపినప్పుడు, ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ కక్షలతోనే పోలీసులు కేసులు బనాయిస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.
ఈ జాబితాలో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా పోలీసులు వాటిని అమలు చేయడంలో మీనమేషాలు లెక్కించడం. ముఖ్యంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై రాష్ట్రంలోనే అత్యధికంగా 5 నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు హైదరాబాద్ జిల్లా ఈ-కోర్టుల వెబ్సైట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 నుంచి కరీంనగర్ జిల్లా పరిధిలో నమోదైన ఈ కేసుల్లో, ఎల్లందకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక కేసులో నిందితుడిని పరారీలో ఉన్నట్లు ప్రకటించడం, ఆస్తుల జప్తునకు సంబంధించిన సీఆర్పీసీ సెక్షన్లు 82, 83 కింద చర్యలు పెండింగ్‌లో ఉన్నట్లు కోర్టు రికార్డుల్లో నమోదైంది. దీనిపై తదుపరి విచారణ డిసెంబర్ 2న జరగనుంది. అయితే, వారెంట్ల అమలుకు తమకు కోర్టుల నుంచి ఎటువంటి ఆదేశాలు అందలేదని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడం గమనార్హం.
ఇవి కూడా చదవండి
వారెంట్లు, సమన్లు ఎదుర్కొంటున్న వారిలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన హేమాహేమీలు ఉన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య లపై ఇటీవలే వీరికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, నోముల భగత్ కుమార్ తదితరులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఇక సమన్లు, విచారణ దశలో ఉన్నవారు కూడా భారీగానే ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌లకు కోర్టు సమన్లు జారీ చేసింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై ఎన్నికల సంబంధిత కేసు ట్రయల్ దశకు చేరుకుంది. ఇక.. దాడి కేసులో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గౌడ్, గేమింగ్ యాక్ట్ ఉల్లంఘన కేసులో ఎమ్మెల్సీ పి. శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సమన్లు ఎదుర్కొంటున్నారు. అయితే, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే సి. వంశీకృష్ణారెడ్డిలపై జారీ అయిన ఎన్బీడబ్ల్యూ కేసులను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది.
ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటైనప్పటికీ, విచారణ ప్రక్రియలో జాప్యం, పోలీసుల ఉదాసీనత ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించబోయే నివేదిక, తదుపరి తీసుకునే చర్యలపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.







